సుష్మా స్వ‌రాజ్ సాయానికి పాక్ మ‌హిళ ఫిదా!

Update: 2017-07-28 08:06 GMT
ప‌ఠాన్ కోట్‌ - ఉరీ - స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వంటి ఘ‌ట‌న‌ల త‌ర్వాత భార‌త్‌ - పాక్ ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. నిత్యం స‌రిహ‌ద్దు వ‌ద్ద దాయాది దేశం క‌య్యానికి కాలు దువ్వుతూ భార‌త సైనికులను రెచ్చ‌గొడుతుండ‌డంతో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొని ఉంది.  ఇరు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వైద్యం కోసం భార‌త్ కు రావాల‌నుకుంటున్న పాకిస్థానీల‌కు వీసాలు దొర‌క‌డం గ‌గ‌న‌మైంది. అయితే, దాయాది దేశానికి చెందిన రోగుల‌పై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ద‌య చూపిస్తున్నారు.

మాన‌వ‌త్వంతో వారికి వీసాలు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మొన్న‌టికి మొన్న ఓ పాకిస్థాన్ చిన్నారి ఆప‌రేష‌న్ కోసం అత‌డి త‌ల్లిదండ్రుల‌కు సుష్మ‌ వీసా మంజూరు చేయించారు. అదే త‌ర‌హాలో తాజాగీ మ‌రో మహిళ‌కు వీసా ఇప్పించ‌డంతో ఆ మ‌హిళ సుష్మాస్వ‌రాజ్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. సుష్మాస్వరాజ్‌ సాయం చేసే గుణానికి మన భారతీయులే కాదు పాకిస్థానీలూ ఫిదా అయిపోయారు. హిజాబ్‌ అసీఫ్‌ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఆమె భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. హిజాబ్‌ మెడికల్‌ వీసా కోసం ఇస్లామాబాద్‌లోని డిప్యూటీ హైకమిషనర్‌ను ఆశ్రయించినా ఫ‌లితం లేదు. దీంతో హిజాబ్‌ సుష్మా స్వరాజ్‌ను ఆశ్రయించింది.

‘మేడమ్‌.. నాకు కాలేయ సమస్య ఉంది. భారత్‌ లో చికిత్స చేయించుకోవాలి. మెడికల్‌ వీసా కావాలని అడిగితే అది మీరే చూసుకోవాలని అంటున్నారు. నాకు సాయం చేయండి’ అని ట్వీట్‌చేసింది. మాన‌వ‌త్వంతో ఎంతో మంది పాకిస్థానీల‌ను ఆదుకున్న‌సుష్మా స్వ‌రాజ్ ఎప్పటిలాగే వెంటనే స్పందించారు. హిజాబ్ కు మెడికల్‌ వీసా వచ్చేలా డిప్యూటీ హైకమిషనర్‌ను ట్విటర్‌లో సుష్మ ఆదేశించారు.

త‌న ట్వీట్ కు వెంట‌నే స్పందించిన‌ సుష్మాపై హిజాబ్‌ ప్రశంసల జల్లులు కురిపించింది. ‘సుష్మాజీ.. ఏమని పిలవను మిమ్మల్ని? సూపర్‌ విమెన్‌ అనాలా లేక దేవత అని సంబోధించాలా? మీ మంచితనాన్ని వివరించడానికి మాటలు రావడంలేదు. లవ్యూ మేడమ్‌. కన్నీళ్లతో మిమ్మల్ని పొగడటం ఆపలేను. నా గుండె మీకోసమే కొట్టుకుంటోంది. మీరు మా ప్రధాని అయివుంటే ఎంత బాగుండో. అయినా మీలాంటి ప్రధానిని పొందే అర్హత పాక్‌ కు లేదు’ అని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది. సుష్మ పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News