డోక్లామ్‌ లో భార‌త్ సైనికులు ఏం చేస్తున్నారు?

Update: 2017-07-10 05:44 GMT
మొండిగా వ్య‌వ‌హ‌రించే వారిని దారికి తీసుకురావాలంటే మ‌రింత మొండిగా మారాలి. అవ‌స‌ర‌మైతే జ‌గ‌మొండిగా ఉండాలి. అప్పుడు మాత్ర‌మే విష‌యం దారికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌య్యాలమారి చైనా తీరును త‌ప్పు ప‌డుతూ.. భార‌త సైన్యం వేస్తున్న అడుగులు భార‌త్ - చైనా మ‌ధ్య‌న కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ స‌హ‌జ మిత్రుడైన భూటాన్‌ కు అభ‌య‌హ‌స్తం అందిస్తూ.. చైనా చొర‌బాటును నిలువ‌రించే విష‌యంలో భార‌త సైనికులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

భార‌త్‌.. భూటాన్‌.. చైనాల మ‌ధ్య కూడ‌లిగా పిలిచే ట్రై జంక్ష‌న్ లోకి వెళ్లిన భార‌త సైనికులు వెన‌క్కి త‌గ్గటం లేదు. మ‌న సైనికుల్ని వెనుదిర‌గాలంటూ చైనా ఒత్తిడిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు స‌రికదా.. అక్క‌డే ఉండేందుకు మొగ్గు చూపుతోంది. భూటాన్ స‌రిహ‌ద్దుల్ని ప‌రిరక్షించే విష‌యంలో త‌మ క‌మిట్ మెంట్‌ ను భార‌త సైనికులు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

చైనా బెదిరింపుల‌కు ఏ మాత్రం స్పందించ‌ని మ‌న సైనికులు.. వివాదంగా మారిన డోక్లాంలో గుడారాలు వేసుకొని మ‌కాం వేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా చ‌ర్య‌తో చైనా బెదిరింపుల‌కు బెదిరిపోయే ప్ర‌స‌క్తే లేద‌న్న విష‌యాన్ని భార‌త్ స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి. అదే స‌మ‌యంలో.. డోక్లాంలో గుడారాలు వేసుకున్న జ‌వాన్ల‌కు అవ‌స‌ర‌మైన స‌ర‌ఫ‌రాల‌న్నీ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నాయ‌ని సైన్యాధికారి వెల్ల‌డిస్తున్నారు.

సిక్కిం నుంచి దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ఉండే డోక్లామ్ విష‌యంలో రాజీ ప్ర‌స‌క్తి లేద‌ని చైనా చెబుతోంది. బంతి భార‌త్ కోర్టులోనే ఉంద‌న్న చైనా.. మాట‌లతో భార‌త్ ను ఒత్తిడికి గురి చేయాల‌ని భావిస్తోంది.

భార‌త్ కానీ డోక్లాం నుంచి వెన‌క్కి త‌గ్గితే.. ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాల‌న్న‌ది చైనా దుర్మార్గ ఆలోచ‌న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. అదే జ‌రిగితే.. భూటాన్ స‌రిహ‌ద్దు ప్రాంతం చైనా సొంతం కావ‌ట‌మే కాదు.. భార‌త్ లోకి ప్ర‌వేశించేందుకు కీల‌క‌మైన చికెన్ నెక్ మీద చైనా ప‌ట్టు మ‌రింత పెరగ‌టం ఖాయం. అందుకే.. డోక్లాం విష‌యంలో భార‌త్ ఒకింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

సిక్కిం స‌రిహ‌ద్దుల్లో చైనాతో ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొని ఉంటే.. కాశ్మీర్‌లోని భార‌త్ - పాక్ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా భార‌త సైనిక ద‌ళం పాక్ కు చెందిన సైనిక బంక‌ర్ ను ధ్వంసం చేసింది. జ‌మ్మూకాశ్మీర్ లోని పూంచ్ స‌రిహ‌ద్దుల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బంక‌ర్‌ ను ధ్వంసం చేసే ఉదంతంలో భార‌త జ‌వానుకు గాయాల‌య్యాయి. నియంత్ర‌ణ రేఖ స‌మీపంలోని పాక్ ఆర్మీ పోస్టును భార‌త్ బ‌ల‌గాలు పేల్చి వేశాయి. కొన్ని నెల‌లుగా జ‌మ్మూకాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లోని సాధార‌ణ పౌరుల‌పై పాక్ కొన్ని రోజులుగా అకార‌ణంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ‌టంతో ప‌లువురు పౌరులు గాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో పాక్ బంక‌ర్ ను భార‌త్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘ‌ట‌న‌లో పాక్‌కు చెందిన ఇద్ద‌రు సైనికులు మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే స‌రిహ‌ద్దుల్లో భార‌త సైనికులు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నార‌ని ఆరోపిస్తూ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్లామాబాద్‌ లోని భార‌త డిప్యూటీ హైక‌మిష‌న‌ర్ జేపీ సింగ్‌ కు స‌మ‌న్లు జారీ చేసింది.  ఆదివారం స‌మ‌న్లు అందించే క్ర‌మంలో భార‌త్ తీరును ఖండించేందుకే ఈ చ‌ర్య చేప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు. భారత సైనికుల కాల్పుల కార‌ణంగా మొత్తం ఐదుగురు మ‌ర‌ణించిన‌ట్లుగా పాక్ వెల్ల‌డించింది.
Tags:    

Similar News