సర్కారుపై ఓ మహిళ ఆగ్రహాన్ని చూసిన మండలి ఛైర్మన్‌

Update: 2015-06-09 04:25 GMT
తెలంగాణ ఏర్పాటు అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఘనంగా సంబురాలు నిర్వహించింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమాల్ని ఘనంగా ముగించింది. ప్రభుత్వ కార్యాలయాలకు లైట్లు పెట్టించి.. పండుగ శోభను తలపించేలా చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏడాది సమయంలో చాలానే చేశామని చెబుతూ.. రానున్న కాలంలో మరింత చేస్తామని చెప్పటం తెలిసిందే.

తాజాగా శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌  పాల్గన్న ఒక సభలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలోజరిగిన సభలో స్వామిగౌడ్‌ మాట్లాడుతుండగా ఒక మహిళ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.  ఏడాది ముందు గూడ ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలానే మాటలు చెప్పి పోయిండని.. ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా? అని సూటిగా ప్రశ్నించింది.

ఆమె మాటకు మరికొందరు మహిళలు తమ స్వరాన్ని జత చేయటంతో కాద్దిపాటి ఇబ్బందికి గురైనప్పటికీ.. త్రోటు పడకుండా స్వామిగౌడ్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదే అయిన నేపథ్యంలో కొన్ని అమలు చేయటం సాధ్యం కాలేదని.. అన్ని సమస్యల పరిష్కారానికి ఏడాది సరిపోదని బుజ్జగించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఒక సగటు మహిళ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు గురించి ఏ విధంగా ఆలోచిస్తుందన్నది చెప్పటానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెబుతున్నారు.


Tags:    

Similar News