8 గంటల జర్నీ 18 గంటలైనా ఫీల్ కాలేదు

Update: 2016-08-17 11:43 GMT
ఇవాల్టి రోజున అనుకున్న సమయానికి అనుకున్నది జరగకపోతే సహించలేరు. అందులోకి తమకేమాత్రం సంబంధం లేని కారణంగా తమ షెడ్యూల్స్ డిస్ట్రబ్ కావటాన్ని ఎవరూ సహించలేదు. సమయానికి రావాల్సిన ట్రైన్.. బస్సు..విమానం.. ఏదైనా సరే ఆలస్యంగా వస్తే జనాలు తిట్టి పోయటమే కాదు.. ఫిర్యాదులు చేస్తారు. అలాంటిది 8 గంటల్లో ముగియాల్సిన విమాన ప్రయాణం ఏకంగా 18 గంటల పాటు సాగితే.. పరిస్థితి ఎలా ఉంటుంది? విమానంలోని ప్రయాణికులు ఎలా ఫీల్ అవుతారు? అన్న ప్రశ్నకు సమాధానం ఊహించటానికే ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. అద్భుతం అన్నట్లుగా తమ జర్నీ అన్నేసి గంటలు ఆలస్యమైనా ఏ ఒక్కరూ కించిత్ ఫీల్ కాలేదు సరి కదా.. హ్యాపీగా ఫీలయ్యారు. ఒక అద్భుతానికి తాము సాక్షులైనందుకు తెగ మురిసిపోయారు. ఇంతకీ అంతటి అద్భుతం ఏం జరిగింది?

మూడు రోజుల క్రితం సెబు పసిఫిక్ ఎయిర్ ఫ్లైట్ దుబాయ్ నుంచి మనీలాకు బయలుదేరింది. మొత్తం ప్రయాణ సమయం 8 గంటలు. విమాన ప్రయాణికుల్లో ఒక గర్భిణి మహిళ. ఆమెకు సాయంగా ఆ మహిళ తల్లి ఉన్నారు. ఫ్లైట్ కదిలింది. కాసేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. విమానం దించటానికి అవకాశం లేదు. ఎందుకంటే కింద సముద్రం. దీంతో.. ఆమెకు డెలివరీ చేసేందుకు కొన్నిఏర్పాట్లు చేశారు. పురిటి నొప్పులతో ఆమె విలవిలలాడుతోంది. ఫ్లైట్లోని వారంతా విపరీతమైన టెన్షన్ కు గురైన వేళ.. ఆమెకు విశాలమైన సీటు ఇచ్చేందుకు వేరే చోటకు తరలించారు. అక్కడ ఏర్పాట్లు చేస్తుండగానే ఒక పండండి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.

ఒక టబ్ నిండా నీళ్లు నింపి పుట్టిన బిడ్డను.. తల్లిని శుభ్రం చేశారు. అనంతరం తల్లికిస్నానం చేయించారు. తిరిగి ఆమెను సీట్లో కూర్చోబెట్టారు. ఇద్దరుగా విమానం ఎక్కి ముగ్గురు అయ్యారు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. ఆమె డెలివరీ జరిగే సమయానికి విమానం భారత గగనతలం మీద ఉంది. దీంతో పుట్టిన ఈ బిడ్డ భారతీయ పౌరసత్వం వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డకు రక్షణ చర్యల కోసం విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో దించేశారు. దీంతో 8 గంటల్లో ముగియాల్సిన ప్రయాణం 18 గంటలుపట్టింది. అయినా.. ఏ ఒక్క ప్రయాణికుడు కించిత్ కూడా ఫీల్ కాలేదట. ఇదంతా  చూసిన ఒక సహ ప్రయాణికురాలు తల్లిబిడ్డ ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News