ఆ అమ్మాయి ఫోన్..టీ విప్ ను వణికించింది

Update: 2016-11-06 04:52 GMT
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల వ్యవహారం కొత్త కొత్త సమస్యలకు కారణంగా మారుతోంది. ఆల్ హ్యాపీస్ అన్నట్లుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అటు ప్రభుత్వం.. ఇటు మీడియా చెబుతున్న నేపథ్యంలో పైకి మాత్రం  ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్లుగా కనిపిస్తోంది. కానీ.. కొత్త జిల్లాలకు సంబంధించిన అసంతృప్తి పలు చోట్ల నివురు గప్పిన నిప్పులా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పలు మండలాల్ని కలిపిన తీరుపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే.. దీనిపై మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోవటంతో చాలా నిరసనలు.. ఆందోళనలు బయట ప్రపంచానికి రాని పరిస్థితి.

మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సర్కారు చేసుకుంటున్న పాజిటివ్ ప్రచారాన్ని అడ్డుకునేలా విపక్షాలు గళం విప్పక పోవటం కూడా ఒక కారణంగా చెప్పాలి. తెలంగాణ సమాజంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఒక్కరు మాత్రం పదే పదే.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని ఒకటికి నాలుగుసార్లు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇది మినహా.. మిగిలిన వారు ఎవరూబలంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేయలేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలియజేసే ఉదంతం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగడి సునీతను వణికించిన ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే.. శుక్రవారం రాత్రి వేళ.. తన సొంతింట్లో ఉన్న గొంగడి సునీతా మహేందర్ రెడ్డికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా ఒక యువతి తనను పరిచయం చేసుకొని.. గుండాల మండలాన్ని జనగాం జిల్లాలో కలపటం కారణంగా తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బ తిన్నాయని..  తమ మండలాన్ని జనగాం జిల్లాలో ఎలా కలుపుతారని తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

దీనికి స్పందించిన సునీత.. ఆ నిర్ణయం తాను తీసుకున్నది కాదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారని.. ఏమైనా అడగాలంటే సీఎంను అడగాలని సునీత వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. దీనికి స్పందించిన సదరు యువతి.. మేం మీకు ఓటేసి గెలిపిస్తే మీరు సీఎంను అడగమంటే ఎలా? అని నిలదీయటమేకాదు.. మీరు కలపమని చెప్పకపోయి ఉంటే.. వెంటనే మీ పదవికి రాజీనామా చేయండి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. దీనికి సీరియస్ అయిన విప్ కమ్ ఆలేరు ఎమ్మెల్యే.. ‘‘ఏం బెదిరిస్తున్నావా?’’ అంటూ ఫోన్ పెట్టేశారు. ఈ ఇష్యూ ఇక్కడితో ముగిసిపోతుందని భావించారు.

అయితే.. ఆమె ఊహించని రీతిలో కాసేపటికే ‘‘మన గుండాల’’ వాట్సప్ గ్రూపులో సదరు యువతి మరో మెసేజ్ పెట్టారు. శనివారం ఉదయం 5 గంటల వ్యవధిలో కానీ గుండాల మండలాన్ని యాదారి భువనగిరి జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే సునీత కానీ హామీ ఇవ్వకుంటే తాను సూసైడ్ చేసుకుంటానని సదరు యువతి తేల్చి చెప్పటంతో సునీత ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వెంటనే అలెర్ట్ అయిన ఆమె.. డీఎస్పీకి ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్దప్రాతిపదికన సదరు యువతి ఎవరన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

విప్ ను హడలెత్తించిన ఆ యువతి మాసాన్ పల్లికి చెందిన కేమిడి స్వప్నగా గుర్తించారు. రాత్రి 12 గంటల సమయంలో ఆమె ఇంటికి వెల్లిన పోలీసు ఉన్నతాధికారులు ఆమెను కలుసుకున్నారు. వికలాంగురాలైన ఆమెను సమస్యను అడిగి తెలుసుకున్నారు. గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరిలో కాకుండా జనగాం జిల్లాలో కొనసాగించిన పక్షంలో తమకు ఉద్యోగ అవకాశాలు రావని పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 105 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. జనగాంలో కేవలం 21 పోస్టులే ఉన్నాయి. ఇలాంటి కారణాలు ఉద్యోగ అవకాశాల్ని దెబ్బ తీస్తాయన్నది స్వప్న వాదన. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి.. సమస్యలపై పోరాడాలే కానీ.. ఆత్మహత్య చేసుకోవటం సరికాదంటూ సర్ది చెప్పారు. తాజా ఉదంతం ప్రభుత్వ విప్ ను కాస్త షేక్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News