స‌మ‌స్య‌లు వినే ఓపిక లేదా.. వైఎస్సార్సీపీ మాజీ మంత్రిపై మ‌హిళ ఆగ్ర‌హం!

Update: 2022-07-16 12:59 GMT
వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం చురుగ్గా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జులు ఇంటి ఇంటికీ వెళ్లి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ మూడేళ్ల‌లో వారికి చేసిన ల‌బ్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.

అంతేకాకుండా సీఎం జ‌గ‌న్ వారికి రాసిన లేఖ‌ను కూడా ప్ర‌జ‌ల చేతుల్లో పెడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ‌నే గెలిపించాల‌ని విన్న‌విస్తున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ఎవ‌రూ తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని, మంత్రులతో స‌హా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి ఇంటినీ సంద‌ర్శించాల్సిందేన‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ విస్ప‌ష్ట ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం వైఎస్సార్సీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై త‌మ ముందుకొచ్చిన నేత‌ల‌ను నిల‌దీస్తున్నార‌ని అంటున్నారు. గెలిచిన మూడేళ్ల త‌ర్వాత తాము గుర్తుకొచ్చామా అంటూ మండిప‌డుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ‌కు వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని.. ల‌బ్దిదారుల జాబితాలో త‌మ పేరు తీసేశార‌ని, రోడ్డు సౌక‌ర్యం లేద‌ని ఇలా స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెడుతున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నేత‌లు ఏదో కార‌ణం చెప్పి త‌ప్పించుకుంటున్నారని అంటున్నారు. మ‌రికొంత‌మంది ప్ర‌జ‌ల‌తో దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.

కాగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో తాజాగా మాజీ మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌కు చుక్కెదురు అయ్యంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో శనివారం ఉదయం మాజీ మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా త‌న ఇంటికి వ‌చ్చిన శంకర నారాయణను ఓ మహిళ కడిగి పారేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

గత 11 నెలలుగా త‌న‌కు పింఛన్ నిలిపివేశారని శెట్టిపల్లి గ్రామానికి చెందిన లలితాబాయి అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మా బాయి అనే మరో మహిళ తనకు ఇల్లు రాలేద‌ని మండిప‌డింది. అదే గ్రామానికి చెందిన మరికొంత మంది మహిళలు తమకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. తమ సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే వినకుండా వెళ్లిపోతున్నారని ప్ర‌జ‌లు మండిప‌డ్డారు. ప్రజల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఓ మహిళ తీవ్ర స్థాయిలో మాజీ మంత్రిపై ధ్వ‌జ‌మెత్త‌డంతో అక్క‌డ నుంచి ఆయ‌న జారుకున్నారని అని వార్త‌లు వ‌చ్చాయి.


Full View
Tags:    

Similar News