వైరల్ గా మారిన వైసీపీ కార్యకర్త అమ్ముకుట్టి మాటలు

Update: 2021-11-08 06:18 GMT
అభిమానం ఉండాలి. కానీ.. అది కాస్తా దురభిమానంగా అస్సలు మారకూడదు. రాజకీయ నేతల మీద అంతులేని అభిమానాన్ని చూపించటం.. అందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే తీరు చాలామందిలో కనిపిస్తుంది. తాము అభిమానించే సినిమా హీరో కోసం.. తాము ఫాలో అయ్యే రాజకీయ పార్టీ కోసం.. నేత కోసం దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరించటం.. తమకున్న అభిమానాన్ని తప్పు పట్టేలా ఎవరైనా మాట్లాడితే వారితో గొడవ పెట్టుకోవటానికైనా సిద్ధమయ్యే పరిస్థితి చాలామందిలో ఉంటుంది. అయితే.. ఇలాంటి వారు మర్చిపోయే పాయింట్ ఏమంటే.. అభిమానం గుండెల్లో ఉంచుకోవాలే కానీ.. అంతకు మించిన స్థాయికి వెళితే లేనిపోని తిప్పలు తప్పించి మరొకటి ఉండదు.

తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఏపీ అధికారపక్షమైన వైసీపీ కార్యకర్త మాటల్ని వింటే విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆదివారం పుంగనూరు బీఎంఎస్ క్లబ్ ఆవరణలో శ్రీక్రిష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ కార్యకర్త అమ్ముకుట్టి అనవసరమైన అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కష్టాల్ని కొని తెచ్చుకున్నాడు.

సభకు వెళ్లిన అతడు.. సభావేదిక మీదకు వెళ్లే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. అయితే.. తనను స్థానిక సీఐ గంగిరెడ్డి అడ్డుకొని పక్కకు తోసేయటంతో.. పక్కనే ఉన్న శ్రీక్రిష్ణదేవరాయుల విగ్రహం మీద పడ్డాడు. దీంతో.. అతని తలకు గాయమైంది. దెబ్బ తగిలి రక్తం కారుతున్నా.. తనను ఎవరూ పట్టించుకోలేదని.. ఆసుపత్రికి వెళ్లినా తగిన వైద్య సేవలు అందలేదని వాపోయాడు.

బలిజల భేటీ అయినా.. తనకున్న అభిమానంతో వెళ్లానని.. వేదిక ఎక్కిన తనను అక్కడకు రాకూడదంటూ సీఐ చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు అభిమానం ఉంటే గుండెల్లో ఉంచుకోవాలే కానీ.. తనలా దెబ్బలు మాత్రం తగిలించుకోవద్దని కోరుతున్నాడు. అమ్ముకుట్టి మాటలు ఇలా ఉంటే.. అతని దెబ్బలకు కారణమైన సీఐ గంగిరెడ్డి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. వేదిక మీదకు ఎక్కువమంది రావటంతో.. వారిని కిందకు దిగాలని మాత్రమే చెప్పామే తప్పించి.. ఇంకేం అనలేదన్నారు. రద్దీ ఎక్కువగా ఉండి.. అమ్ముకుట్టి విగ్రహం మీద పడినట్లు చెప్పారు. ఏమైనా.. అభిమానం మంచిదే.. కానీ అది హద్దుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




Tags:    

Similar News