గ్రేటర్ ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన యామిని సాధినేని

Update: 2020-11-25 16:30 GMT
ఆ మధ్య వరకు తెలుగుదేశం పార్టీలో కీలకభూమిక పోషించటం.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు.. టీవీ చర్చల్లో అదే పనిగా కనిపిస్తుండేవారు యామిని సాధినేని. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాభావం ఎదురైన నేపథ్యంలో ఆమె సైకిల్ దిగేసి.. కమలం గూటికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అడపాదడపా తప్పించి యాక్టివ్ గా లేరని చెప్పాలి. గతంలో హైదరాబాద్ లో ఉన్న ఆమె.. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలకు తన వంతు ప్రచారాన్ని షురూ చేయాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.

మామూలుగా వస్తే యామిని ప్రత్యేకత ఏముందని అనుకున్నారో ఏమో కానీ? ఎంట్రీలోనే వివాదాస్పద అంశాన్ని ఎంపిక చేసుకొని రంగంలోకి దిగారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఆ మధ్యన అక్బరుద్దీన్ ఓవైసీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ.. తనకు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే.. వంద కోట్ల మంది హిందువుల సంగతి చూస్తానని చెప్పటాన్ని ప్రస్తావించి.. ఇప్పుడు ఆ మాట అనే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అసలుసిసలు హిందుస్తానీ బిడ్డ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారన్నారు.

పాతబస్తీలో రోహింగ్యాల్ని ఏరేసే శక్తి బీజేపీకే ఉందన్నారు. రోహింగ్యాలకు ఒక ఫుట్ బాల్ జట్టు.. ఒక టీవీ ఛానల్ ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ నగర శివారులో బ్యాంకు అప్పులు చేసి అపార్ట్ మెంట్లు కొన్నవారందరిని టార్గెట్ చేస్తూ.. నిధుల కొరత వచ్చిన ప్రతిసారీ బీఆర్ఎస్.. ఎల్ ఆర్ ఎస్ పేరుతో ప్రజల మీద భారం మోపుతున్నారన్నారు. సంపదను స్పష్టించే శక్తి తనకే ఉందని ఈ మధ్య సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటపై ఆమె ఘాటు వ్యాఖ్య చేశారు. ‘‘అవును మరి.. నీ కుటుంబ సంపద ఎంత బాగా పెంచుకుంటున్నారో అందరికి తెలుసు’’ అని పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్ వరదలకు కారణం ఏమిటి? చెరువుల్ని టీఆర్ఎస్ నేతలు కబ్జా చేయటమే కదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు వచ్చే ఆదాయాన్ని మిగిలిన జిల్లాలకు.. ఇతర పథకాలకు ఖర్చు చేయటంలో అర్థమేమిటి? అన్న ఆమె.. ఈ మధ్యన కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అధికారం ఉన్నది టీఆర్ఎస్ కాబట్టి.. గ్రేటర్ లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తే.. నిధుల సమస్య ఉండదన్న విషయాన్ని ప్రస్తావించిన యామిని.. ‘ఇదే మాటను సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా చెబుతారా? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి.. రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉంటే నిధుల కొరత ఉండదని చెబుతారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. గులాబీ బాస్ మాటలకుపెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చిన యామిని వ్యాఖ్యలపై సీఎం సారు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News