యనమల- బాబును తప్పుపట్టడంలో సీక్రెట్!

Update: 2018-04-06 14:30 GMT
చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనంటూ చాలా పెద్ద ఎత్తున రంకెలు వేసారు. అప్పటికప్పుడు ఆయన చాలా ఘనమైన డిమాండ్ చేశారని.. వందిమాగధులు అభినందించేశారు. పచ్చపత్రికలు పతాక  శీర్షికల్లో జేపీసీకి డిమాండ్ అంటూ అచ్చొత్తి ప్రజల దృష్టిలో ఆయనను హీరోను చేసేశాయి. కానీ.. తీరా రాష్ట్రానికి వచ్చి.. తెదేపా వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించినప్పుడు మాత్రం.. మంత్రి యనమల రామకృష్ణుడు ఆ డిమాండ్ ను తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. జేపీసీ వేయడం వల్ల మనకే నష్టం అని ఆయన చెప్పారుట. చాలా మంది మంత్రులు యనమల మాటనే సమర్థించారుట.

ఎందుకిలా జరిగిందా అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటకు వస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే గనుక.. విభజన చట్టంలో ఉన్న అంశాలేమిటి.. వాటి ప్రకారం... కేంద్రం రాష్ట్రానికి ఇవ్వవలసిన వాటిలో ఎంత మేరకు కేటాయించింది.. వాటిని రాష్ట్రం ఏ రకంగా ఖర్చు చేసింది.. వంటి సకల విషయాలు వారి అధ్యయనం కిందికి వస్తాయి. పవన్ కల్యాణ్ అడిగితే.. ఏదో దస్ర్తాలను మూటగట్టి పంపినట్లుగా కాకుండా... జేపీసీ వస్తే మాత్రం.. అధికారులు దగ్గరుండి అన్ని వివరాలు అందించాల్సిందే.

కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఏ రకంగా వెచ్చించిందో.. అది సక్రమమో అక్రమమో.. జేపీసీ నిగ్గు తేలుస్తుంది. అంతదాకా వచ్చిన తర్వాత.. తమ ప్రభుత్వం నిర్వహణలోని లోపాలన్నీ బయటపడతాయనేది యనమల భయంగా పలువురు భావిస్తున్నారు.

ఫరెగ్జాంపుల్ 1500 కోట్ల రూపాయలను కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్రం ఇస్తే.. దానిని తాత్కాలిక రాజధాని కోసం ఖర్చు పెట్టేశారు. ఇది ఏరకంగా సక్రమమైన ఖర్చు అవుతుందని అడిగితే.. రాష్ట్రప్రభుత్వం వద్ద జవాబు లేదు. ఇలాంటి వందల లోపాలు.. జేపీసీ ముందు నిగ్గుతేలుతాయని.. దానివల్ల మనకే నష్టం గనుక.. దాని జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని.. ఆ డిమాండు తగదని.. యనమల చంద్రబాబుకు హితబోధ చేసినట్లుగా అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News