బాబు దెబ్బకు యనమల సైతం ఫస్ట్రేట్..?

Update: 2017-03-29 04:35 GMT
ఏపీ అసెంబ్లీలో సిత్రమైన దృశ్యం తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయిన దానికి కాని దానికి తమ రాజకీయ ప్రత్యర్థులపై ఏదో ఒక ముద్ర వేసేందుకు ఏపీ అధికారపక్షం అదే పనిగా ప్రయత్నించటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఏదైనా విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేసే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబంధనల్నిపాటించటం లేదని.. సభా సంప్రదాయాల గురించి తెలీదంటూ ఎద్దేవా చేయటం కనిపిస్తుంది. అందులో నిజం ఎంతన్న విషయాన్ని తరచూ నీతులు చెప్పే ఏపీ ఆర్థికమంత్రి  యనమల వారి మాటల్నిచూస్తేనే అర్థమవుతుంటుంది.

విపక్ష నేత జగన్ ను తప్పు పట్టే క్రమంలో.. అసెంబ్లీలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. సంప్రదాయాల్ని తెలుసుకోవాలంటూ యనమల చెబుతుంటారు. నచ్చని వారు చేసినపనుల గురించి ఇలా మాట్లాడే యనమల.. తమ అధినేత చేస్తే మాత్రం అహా.. ఓహో అన్నట్లుగా మాట్లాడేయటం కనిపిస్తుంది.అధినేతను తరచూ ఆకాశానికి ఎత్తేసే యనమల లాంటి వారికి సైతం.. మంగళవారం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు యనమలను ఫస్ట్రేట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

సభా సంప్రదాయం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు మీద ఆర్థికమంత్రి ప్రసంగిస్తారు. ప్రతి ఒక్కరిని హైజాక్ చేసేసి..తాను మాత్రమే హైలెట్ కావాలన్న ఆశ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రతి విషయం మీదా మాట్లాడేందుకు ఆయన తరచూ ప్రయత్నిస్తుంటారు.తాజాగా ద్రవ్య వినిమయ బిల్లు మీద యనమల మాట్లాడుతున్నక్రమంలో జోక్యం చేసుకున్న చంద్రబాబు.. నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘ ప్రసంగాన్ని చేసేశారు.

తాను చెప్పాల్సిన ద్రవ్య బిల్లుపై వివరాల్నిముఖ్యమంత్రి చెప్పేయటంపై యనమల ఫస్ట్రేట్ అయ్యారేమో కానీ.. ఆయననోటి నుంచి వచ్చిన మాటలు.. ఆ భావాన్ని కలిగించేలా ఉండటం గమనార్హం. ‘‘శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై సీఎం మాట్లాడటం జరగదు. కానీ.. ఇక్కడ మా సీఎం మాట్లాడారు. శాసనసభ చరిత్రలో ఇలా ఇదివరకెప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి మాట్లాడారు కనుక ఇక నేను చెప్పేందుకు ఏముంటుంది?’’ అంటూ నిట్టూర్పు విడుస్తూ యనమల చెప్పిన మాటల్నివిన్నప్పుడు ఆయన ఫస్ట్రేషన్ లెవల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News