ఇంద్రుడు చంద్రుడు అన్న నాయకుడే షాకిచ్చారు

Update: 2022-09-21 10:34 GMT
ఆయన ఏయూలో హిందీ విభాగంలో ఆచార్యుడిగా పనిచేసేవారు. తరువాత కాలంలో రాజకీయాల మీద ఆసక్తిని పెంచుకుని టీడీపీ వైపుగా అడుగులు వేశారు.ఆయనే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఎన్టీయార్ జాతీయ పార్టీ పెట్టాలనుకున్నపుడు ఆయనకు హిందీ పాఠాలు చెప్పే క్రమంలో చేరువ అయ్యారు. అలా టీడీపీలో కొనసాగుతూ రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబు వైపు నడిచారు.

అయితే ఆ తరువాత  చంద్రబాబు విధానాలతో విభేదించి వైఎస్సార్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అలా ఆయన జగన్ తో కూడా క్లోజ్ అయ్యారు. దాంతో వైసీపీ అధికారంలోకి రావడమే తడవు జగన్ ఆయనకు తెలుగు అధికార భాషా సంఘం ప్రెసిడెంట్ ఇచ్చారు. క్యాబినేట్ ర్యాంక్ పదవి ఇది. అలా మూడేళ్ళుగా ఆయన ఈ కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు.

జగన్ని ఆయన కంటే ఎవరూ బాగా పొగిడి ఉండరు. జగన్ కంటే ఏపీకి తెలుగు భాషకు  ఎవరూ పెద్దగా మేలు చేసింది లేదని కూడా పలు సందర్భాల్లో ఆయన కీర్తించారు. ఏపీలో ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ఆయన నోరు మెదపకుండా జగన్ కే సపోర్ట్ గా ఉన్నారు. తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు ఏం చేస్తున్నారు అని నాడు అంతా ప్రశ్నించినా యార్లగడ్డ మాత్రం మౌనమే దాల్చారు.

ఇక ఆయన తాజాగా ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి అన్న గారి పేరు మారుస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నాట్లుగా ప్రకటించి సంచలనం రేపారు. ఎన్టీయార్ పేరుని మార్చడం తప్పు అని యార్లగడ్డ అంటున్నారు. వైఎస్సార్ పేరుకు తాను వ్యతిరేకం కాదని, కానీ ఎన్టీయార్ పేరిట ఉన్న సంస్థకు మార్చి పెట్టడం తగదని ఆయన చెబుతున్నారు. ఈ నిర్ణయం తనను బాగా బాధించింది అని ఆయన చెప్పుకున్నారు.

మొత్తానికి యార్లగడ్డ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలుగు భాషా సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఏపీలో తెలుగునకు ఏమి చేశారన్నది కూడా పెద్ద ప్రశ్న అనే అంటారు. యార్లగడ్డ తెలుగు భాష అభివృద్ధికి, అధికార భాషగా దాన్ని అమలు చేయడానికి పెద్దగా చేసింది లేదని కూడా విమర్శలు ఉన్నాయి.

అలాంటి యార్లగడ్డ ఇపుడు రాజీనామా చేయడం ద్వారా జగన్ కి గట్టి  ఝలక్ ఇచ్చారు. అయితే యార్లగడ్డ తెలుగు భాష విషయంలో పెద్దగా  ఏమి చేయకపోయినా ఎన్టీయార్ విషయంలో మాత్రం ఆయన స్పందించిన తీరు మాత్రం బాగానే ఉంది అని అంటున్నారు. తెలుగు జాతికి స్పూర్తి అయిన ఎన్టీయార్ పేరుని తొలగించడం అంటే తెలుగుకు కూడా  అవమానమే. అందుకే యార్లగడ్డ తన పదవికి రాజీనామా చేసి జగన్ సర్కార్ కి తొలి షాక్ ఇచ్చారని చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News