అధికారులపైనే వైసీపీ ఎంఎల్ఏ ఫిర్యాదు

Update: 2021-09-15 16:30 GMT
జిల్లా అధికారులపైనే వెంకటగిరి ఎంఎల్ఏ, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేశారు. పోయిన నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తనకు ఆహ్వానం అందలేదన్నది ఆనం ఫిర్యాదు. తనను ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నం చాలాకాలంగా దిగులు పడిపోతున్నారు. అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి ఆగ్రహం కూడా వ్యక్తంచేస్తుంటారు.

తనంతటి సీనియర్ నేత, ఎంఎల్ఏను అధికారయంత్రాంగం, మంత్రులు లెక్కచయకపోవటం ఏమిటంటూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు. ఆనం సీనియర్ నేతే కానీ వాస్తవంలో బతకటం లేదన్న విషయం అందరికీ అర్ధమవుతోంది. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండన్న పద్దతిలో ఆనం ఇపుడు వ్యవహరిస్తున్నారు. మంత్రులైనా, జిల్లా ఉన్నతాధికారులైనా తన మాటను వినితీరాల్సిందే అనే భ్రమల్లో ఉన్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే రాజకీయాల్లో రేపు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి ఈరోజు ఏమిటన్నది ఇంపార్టెంట్. ఒకపుడు ఆనం జిల్లాలో ఏకపక్షంగా చక్రం తిప్పింది వాస్తవమే. ఆనం ఏకఛత్రాధిపత్యం వహించిన రోజుల్లో మరి మిగిలిన నేతలు ఎంతగా ఇబ్బందులు పడుంటారన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్లున్నారు. రాజకీయం అనేక సైకిల్ చక్రంలాంటిది. కొందరికి కొంతకాలం బ్రహ్మాండంగా జరిగితే మరికొందరికి కొన్ని రోజులు జరుగుతుంది.

కాబట్టి ఇఫుడు జరుగుతున్నది తన టైం కాదన్న విషయాన్ని ఆనం జీర్ణించుకోవాల్సిందే తప్ప వేరే దారిలేదు. తన టైం వచ్చేవరకు వెయిట్ చేయటం తప్ప ఆనం చేయగలిగింది కూడా ఏమీలేదు. అయితే ఆనం ఆలోచనలు మాత్రం వేరేరకంగా ఉంటున్నాయి. అందుకనే చీటికి మాటికి మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు అధికారులపైన కూడా ఊగిపోతుంటారు. ఇపుడు ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకులకు తనకు ఆహ్వానం అందలేదని చేసిన ఫిర్యాదు ఇందులో భాగమే.

మంత్రులు, ఎంఎల్ఏలను ఏమీ అనలేక, నిలదీయలేక తనకోపాన్ని అధికారులపైన తీర్చుకోవాలని అనుకున్నట్లున్నారు. అది కూడా ఇండిపెండెన్స్ డే అయిపోయిన నెలరోజుల తర్వాత. నిజంగానే అధికారులపై ఫిర్యాదు చేయదలచుకుంటే ఇన్నిరోజులు ఆనం ఏమి చేస్తున్నట్లు ? ఏదో రకంగా హడావుడి చేసి వార్తల్లోకి ఎక్కాలనే ఉద్దేశ్యం మాత్రమే కనబడుతోంది ఆనం ఫిర్యాదులో. సరే ఎలాగూ ఫిర్యాదు చేశారు కడా ఏమి జరుగుతుందో చూద్దాం.


Tags:    

Similar News