రజనీ వచ్చారంటే..బాబుకు తడిసిపోవడం గ్యారెంటీ!

Update: 2019-10-03 15:26 GMT
నిజమే... ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరు మీడియా ముందుకు వచ్చినా... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కడిగిపారేస్తున్న పరిస్థితి. ఇలాంటి వైసీపీ నేతల్లో మొన్నటిదాకా వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముందు వరుసలో ఉండగా... ఇప్పుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచిన మహిళా నేత విడదల రజనీ... బాబుపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సూటిగా సుత్తి లేకుండా ఆమె సంధిస్తున్న విమర్శలతో అసలు ఏం సమాధానం చెప్పాలో తెలియక... టీడీపీ నేతలు సతమతమైపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా గురువారం చంద్రబాబును మరోమారు టార్గెట్ చేసిన రజనీ... సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం అబద్ధాలు మాట్లాడే చంద్రబాబును చూస్తే... అబద్ధమే సిగ్గుపడుతోందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిన్న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలు బంద్ అయ్యాయి కదా. ఈ ఏడాదే కాకుండా ఏటా గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలు నిలిచిపోతున్నాయి కదా. ఈ మాటను మరిచిపోయిన చంద్రబాబు... నిన్న జగన్ మోహన్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ... గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలు జరుపుతారా? అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలో అసలు నిజమెంత అన్న విషయాన్ని కూడా చంద్రబాబు గమనించినట్టుగా లేరు. ఏదో అలా నోటిచ్చిన వ్యాఖ్యను బయటకు వదిలేసి... గాంధీ జయంతి రోజున కూడా జగన్ సర్కారుపై విరుచుకుపడ్డానన్న భావనతో వెళ్లిపోయారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై గురువారం పొద్దున్నే విడదల రజనీ తనదైన శైలిలో ఫైరయ్యారు. గాంధీ జయంతి రోజున ఒక్క ఏపీలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోతే... ఏపీలో గాంధీ జయంతి రోజున కూడా మద్యం విక్రయాలు జరిగాయని ఆరోపించిన చంద్రబాబు... అసలు గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలు ఎక్కడ జరిగాయో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులను రద్దు చేశారని తెలిపారు. మొత్తంగా 20 శాతం మద్యం షాపులు తగ్గించారన్నారు. ప్రమాణ స్వీకారం రోజున బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పి సంతకం చేసిన చంద్రబాబు మాట తప్పారని.. ఆయన హయాంలో మద్యం ఏరులై పారిందని మండిపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగేవని విమర్శించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే... ఆయన నోట నుంచి వస్తున్న అబద్ధాలు చూస్తుంటే... ఆయనను చూసిన తర్వాత అబద్ధం కూడా సిగ్గుపడుతోందని ఆమె సెటైరికల్ విమర్శలు గుప్పించారు.


Tags:    

Similar News