జగన్‌ కు వందపైనే..పచ్చ మీడియా సర్వే!

Update: 2018-09-20 06:33 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో రానున్న ఎన్నికలలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం ఉందా...?  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రమాణం చేయనున్నారా ..... అవుననే చెబుతున్నాయి సర్వేలు. ఇలా చెప్పినవి కూడా అధికార తెలుగుదేశం పార్టీకి అనుచరులైన పచ్చ పత్రికలేనని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలపై తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే కొన్ని పత్రికలు రహస్య సర్వే నిర్వహించాయట. ఆంధ్రప్రదేశ్‌ లో తమ పరిస్థితి ఎలా ఉందో సరిగా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా చేత రహస్య సర్వే జరిపించారట. ఈ సర్వేలో నాలుగైదు ప్రధానాంశాలను జోడించి ఓటర్ల అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది - అభివ్రుద్ది కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి - మంత్రుల పనితీరు - అధికారుల స్పందన వంటి కీలక అంశాలపై చంద్రబాబు మీడియా సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో ఎక్కువ మంది పెదవి విరుపు సమాధానమే చెప్పినట్లు సమాచారం.

రాష్ట్రంలో అన్ని స్ధాయిలలోను ప్రభుత్వం వెనుకబడి ఉందని - బాబు పాలన పట్ల ఏ వర్గంలోను సంత్రుప్తి లేదని సర్వే వివరాల ద్వారా తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అవినీతి బాగా పెరిగిందని - ఇక మంత్రులైతే ఎప్పుడో చేతులు దాటిపోయారని అభిప్రాయ పడినట్లు సమాచారం. పశ్చిమ గోదావరికి చెందిన ఓ ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దందా ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉందని సర్వేలో తేలిందని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఇద్దరు ఎమ్మెల్యేలు తన అవినీతితో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని అక్కడి ఓటర్లు బహిరంగంగానే చెప్పారట. ఇదే జిల్లాలో చాలా నియోజకవర్గాలలో శాసన సభ్యుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిందని తేలింది.

విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య వివాదాలు - పార్టీ నాయకుల మధ్య అనైక్యత పెరిగిపోయిందని పచ్చ మీడియా సర్వేలో తెలిందని సమాచారం. రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత నానాటికి ఎక్కువవుతోందట. అనంతపూరం ఎంపీ జేసీ. దివాకర్‌ రెడ్డి వైఖరితో పార్టీకి నష్టం కలుగుతోందని ఆ జిల్లా నాయకులే మీడియా సర్వేలో వెల్లడించారట.  ఇక నెల్లూరు జిల్లాలో మంత్రుల మధ్య విబేధాలు - ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరాడం కూడా తెలుగుదేశం పార్టీకి న‌ష్టమేనని సర్వేలో పేర్కొన్నారు. ఈ పచ్చ మీడియా సర్వే ఆధారంగా రానున్న ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 నుంచీ 130 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసిందట. జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన ఎక్కువగా ఉండడం వెనుక ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని సర్వేలో వెల్లడైనట్లు చెబుతున్నారు. ఈ సర్వే ఆధారంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు నష్ట నివారణ చర్యలు  చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
Tags:    

Similar News