కోడెల క‌క్కుర్తి చూసి టీడీపీయే ముక్కున వేలేసుకుందా...!

Update: 2019-07-25 05:53 GMT
మాజీ శాసన సభాపతి కోడెల శివ‌ప్ర‌సాద్‌ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌యా యార్క‌ర్ ప్ర‌యోగించింది. ఇప్ప‌టికే వ‌రుస వివాదాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కోడెలపై తాజాగా వైసీపీ సంధించిన అస్త్రంతో ఆయ‌న విల‌విల‌లాడుతున్నారు. ఇంతకీ వైసీపీ సంధిస్తున్న ఆయుధమేంటి.. ?  హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన కుంభకోణంలో కోడెల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌.. ?  అధికార పార్టీ ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే మాజీ స్పీక‌ర్‌ ను టార్గెట్ చేసిందా... ? ఇప్పుడివే ప్ర‌శ్న‌లు ఏపీ పాలిటిక్స్‌ లో హాట్‌ టాపిక్ అవుతున్నాయి.

హైదరాబాద్‌ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో - ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన శాసనసభ్యులకు కూడా నివాసం ఉండేందుకు అవకాశం కల్పించింది విభజన చట్టం. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు శాసన సభ్యులు - అలాగే కొందరు శాసన మండలి సభ్యులు కూడా వీటిలో నివాసం ఉన్నారు. క్వార్టర్స్‌ ను ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు కేటాయించే అధికారం స్పీకర్‌ కు మాత్రమే ఉంటుంది.  అదే అధికారాన్ని ఉపయోగించుకుని అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ - అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది వైసీపీ.

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ మొత్తం అమరావతి నుంచి కార్యకలాపాలు సాగించడం మొదలైన నాటి నుంచి - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు చాలామంది విజయవాడకే పరిమితమయ్యారు. దీంతో ఖాళీగా ఉన్న భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నారని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కోడెల తన వ్యక్తిగత కార్యదర్శి - అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేసిన మరో ఎంప్లాయి - అప్పటి అసెంబ్లీ కార్యాలయంలో కీలకమైన అధికారి సహకారంతో దాదాపు 20కిపైగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ను ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇచ్చారని ఆరోప‌ణ‌లు సంధిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఒక్కో ఎమ్మెల్యే క్వార్టర్‌ ను అద్దెకు ఇచ్చి - దాని ద్వారా నెలకు ఒక్కో ఇంటికి 20 వేల రూపాయల చొప్పున వసూలు చేశారని అంటోంది. ఐదేళ్లపాటు ఈ తతంగం కొనసాగింద‌ని - నాడు స్పీకర్ కార్యాలయం వేదికగా భారీ అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపణలు సంధిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు ఆపార్టీ నేతలు. ఇప్పటికే గుంటూరులోని కోడెల అపార్ట్‌ మెంట్‌‌ లో పలు ఫ్లాట్లను - ప్రభుత్వ శాఖలకు అధిక మొత్తానికి అద్దెకిచ్చి - భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొడుకు - కుమార్తెలు సైతం అవినీతికి ఒడిగట్టారని పలు కేసులు కూడా నమోదు చేశారు. వాటి లెక్కలు కూడా బయటపెట్టారు.

తాజాగా హైదరాబాద్‌ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌ ను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా అద్దెకిచ్చారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోడెల క‌క్కుర్తి చూసి టీడీపీ వాళ్లే ముక్కున వేలేసుకుంటోన్న ప‌రిస్థితి. మొత్తానికి రకరకాల ఆరోపణలతో కోడెల వర్గం ఉక్కిరిబిక్కిరవుతోందని - టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తనపై వైసీపీ నేతల ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేస్తున్నారు కోడెల. అసెంబ్లీ భవనాల అద్దె వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News