రాంగ్ టైమింగ్: గడప గడపలో ఆవేశాలు...ఆక్రందనలు...?

Update: 2022-05-12 10:30 GMT
దేనికైనా టైమ్ చూసుకోవాలి కదా. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉండకూడదు. రాజకీయాల్లో అయితే ఆచీ తూచీ అడుగులు ఉండాలి. ఇక జనాలు అంటే నదీ తరంగాల్లాంటి వారు. ఎల్లపుడూ అక్కడ చలనంగానే సన్నివేశం ఉంటుంది. అలాంటి వారి వద్దకు వెళ్లాలనుకున్నపుడు కాస్తా పకడ్బంధీ ప్లాన్ తో ఉంటే బాగుండేది కదా.

కానీ వైసీపీలో కధ అలా లేదు. మే 11 మంచి ముహూర్తమే,  వైశాఖ శుద్ధ దశమి. శుభ కార్యక్రమాలకు అది కరెక్ట్ ముహూర్తమే అనుకున్నా  రాజకీయంగా అయితే వైసీపీకే కాదు, ఏ అధికార పార్టీకి అది మంచి ముహూర్తం కానే కాదు. ఎందుకంటే  ఎండలు ఒక వైపు మండిస్తున్నాయి. మరో వైపు కరెంట్ కోతలు ఉన్నాయి. ఇంకో వైపు విద్యుత్ చార్జీల బాదుడు ఉంది. పన్నుల బాదుడు అదనపు వ్యవహారం.

ఇక రోడ్లు చూస్తే బాలేవు. అభివృద్ధి గురించి అడిగితే జవాబు లేదు. కేవలం సంక్షేమ పధకాలు పేరు చెప్పుకుని వెళ్ళాలనుకున్నా అందులో కూడా చాలా మందికి అందని పరిస్థితి ఉంది. అందుతున్న వారికి కూడా లేట్ అవుతున్నాయన్న ఆవేదన ఉంది. నిజానికి ప్రజల వద్దకు నేతలు వెళ్లాలీ అంటే చాలా లెక్కలు చూసుకుంటారు.

కానీ ఇక్కడ అధినాయకత్వం మాత్రం గడపగడపకూ బయల్దేరమంది. సరిగ్గా ఈ టైమ్ కోసమే జనాలు చూస్తున్నారు అనుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యేలలో ఎక్కువ శాతం మూడేళ్లుగా జనాల్లో లేరు. ఆ విషయం అధినాయకత్వం వద్ద కూడా రికార్డు అయి ఉంది. అందుకే వారిని జనాల వద్దకు వెళ్ళమంది. కానీ తాము ఎన్నో సమస్యలతో ఉంటే ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే రాలేదు అన్న ఆగ్రహం ప్రజలలో ఉన్న వేళ బాగున్నారా అంటూ ఎమ్మెల్యేలు పలకరించేసరికి వారికి ఎక్కడ లేని సమస్యలూ గుర్తుకువచ్చేశాయి. అంతే కాదు ఇన్నాళ్ళూ కనిపించలేనందుకు ఆగ్రహం ముంచుకొచ్చింది.

ఇలా తొలి రోజునే చాలా మంది ఎమ్మెల్యేలకు నాయకులకు జనాల నుంచి ఇలా వ్యతిరేకత రావడంతో వైసీపీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయినట్లు అయింది. అసలే టీడీపీ సహా ఇతర విపక్షాలు మంచి ఊపు మీద ఉన్నాయి. సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంది. దాంతో ఎమ్మెల్యేల మీద ప్రజలు నోరు చేసుకున్న వైనాలు అన్నీ కూడా వెంటనే రికార్డు అయిపోతున్నాయి.

దీని మీద సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే కవర్ చేసే ప్రయత్నం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు జనాలు ఘన స్వాగతం పలుకుతూంటే టీడీపీ దాని అనుకూల మీడియాలో వ్యతిరేక రాతలు రాస్తున్నారు అని ఆయన మండిపడుతున్నారు. ఇక ఆయన మరో విషయం కూడా చెప్పుకొచ్చారు. ప్రజలు అంటే అందులో టీడీపీ క్యాడర్ కూడా ఉంటుంది కదా అందువల్ల వారే కొన్ని చోట్ల అల్లరి చేసి వాటిని వీడియోలు తీసి పెడుతున్నారు అని ఫైర్ అవుతున్నారు.

ఎవరో ఏదో చేశారు అని అనుకోవడం కంటే ప్రజలు ఇపుడు సకల సమస్యలతో ఉన్నారని ప్రభుత్వ పెద్దలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అన్నదే ప్రశ్న. అదే సమయంలో సరైన సమయం చూసుకుని జనాలకు ఉన్న సమస్యలు కొన్ని అయినా తగ్గాక తాపీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఏం పోయింది అన్న మాట కూడా ఉంది. మొత్తానికి చూస్తే గడప గడప పేరిట వైసీపీ చేస్తున్న ప్రయోగం కోరి విపక్షానికి కొత్త ఆయుధం ఇచ్చినట్లుగా ఉందని అంటున్నారు.
Tags:    

Similar News