వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంటా వార్పులో జ‌నాలు లేక వెల‌వెల‌!

Update: 2020-02-15 17:13 GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత భారీ మెజారిటీ వ‌చ్చిన నియోజ‌క‌ వర్గాల్లో ఒక‌టి గిద్ద‌లూరు. వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ త‌ర్వాత ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబునే ప్ర‌జ‌లు అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారు. అందులో అన్నా రాంబాబు స‌త్తా ఏమీ లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూల నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో.. ఇక్క‌డ ఆయన విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క అయ్యింద‌ని స్థానికులు చెబుతారు. పార్టీకి మంచి బేస్ మెంట్ ఉండ‌టం, సులువుగా నెగ్గే సీటు కావ‌డం, ఆ పై జ‌గ‌న్ గాలి వీయ‌డంతో అన్నా రాంబాబుకు భారీ మెజారిటీ ద‌క్కింద‌ని స్థానికులు చెబుతున్నారు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. వైసీపీకి పులివెందుల త‌ర్వాత అత్యంత భారీ మెజారిటీ వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం అయిన‌ప్ప‌టికీ ఈ నియోజ‌క‌ వ‌ర్గం ప‌రిధిలో పార్టీ కార్య‌క్ర‌మాలు ఏవీ అంత విజ‌య‌వంతం గా సాగ‌క‌ పోవ‌డం గ‌మ‌నార్హం. స్థానిక ఎమ్మెల్యే మామూలుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోడ‌ని అంటారు. ఎప్పుడో ఏవో కొన్ని కార్య‌క్ర‌మాల‌ను మాత్రం చేప‌డ‌తార‌ట‌. అయితే..అలాంటి కార్య‌క్ర‌మాలు కూడా డిజాస్ట‌ర్స్ గా మారుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

అందులో ఒక‌టి తాజాగా నిర్వ‌హించిన వంటా వార్పు కార్య‌క్ర‌మం. ఏపీకి మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా వంటా వార్పు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ ఇచ్చిన పిలుపుతో ఆ మేర‌కు నిర్వ‌హించారు. అయితే..ఆ కార్య‌క్ర‌మం వెల‌వెల‌బోవ‌డం గ‌మ‌నార్హం. ఎంత‌లా అంటే.. క‌నీసం ఇర‌వై మంది కూడా హాజ‌రు కాన‌ట్టు గా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి అత్యంత భారీ మెజారిటీ వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గాల జాబితా లో రెండో స్థానం లో ఉన్న‌ప్ప‌టికీ మ‌రీ ఇలా పార్టీ కార్య‌క్ర‌మం ఫెయిల్యూర్ అవ‌డానికి కార‌ణం ఏమిటంటే.. స్థానిక పెద్ద నేత పేరు వినిపిస్తూ ఉంది.

పార్టీ విజ‌యం కోసం ఎన్నిక‌ల ముందు నుంచి గట్టిగా ప‌ని చేసిన వాళ్ల‌ను, పార్టీ సానుభూతి ప‌రుల‌ను, జ‌గ‌న్ అభిమానుల‌ను ఆయ‌న తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నార‌ని.. దీంతో పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ క‌ష్టం అయిపోతూ ఉంద‌ని స‌మాచారం. ఆ పెద్ద నేత ఎన్నిక‌ల ముందు పార్టీలోకి వ‌చ్చిన వాళ్ల‌కు, గ‌తంలో త‌న‌తో పాటు ప్ర‌జారాజ్యంలో ప‌ని చేసిన వాళ్ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తూ, పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌ను మాత్రం పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తూ ఉన్నార‌ని, దీంతోనే గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కార్య‌క్ర‌మాలు ఇలా త‌యార‌వుతున్నాయ‌ని స్థానిక‌లు చెబుతున్నారు.
Tags:    

Similar News