మొన్న కెప్టెన్.. నిన్న బ్యాటర్.. నేడు టీమ్ నుంచి ఔట్..అయ్యో బాబర్

ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టంతా అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. సొంత గడ్డపై వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోయింది.

Update: 2024-10-13 19:30 GMT

సరిగ్గా నాలుగు నెలల కిందట వరకు అతడు కెప్టెన్.. మొన్నటివరకు జట్టులో ప్రధాన బ్యాట్స్ మన్.. కానీ, ఇప్పుడు కనీసం తుది జట్టులో చోటు కా దొరకని పరిస్థితి.. వందలు, వేల పరుగులు సాధించిన అతడు ఇప్పుడు కనీసం పది పరుగులు చేసేందుకూ చెమటోడ్చుతున్నాడు. జట్టులోని సాధారణ బ్యాట్స్ మెన్ సెంచరీలు కొట్టిన చోట మేటి బ్యాటర్ అయిన ఇతడు దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో ఫ్యాబ్ 4 (రూట్, కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్) తర్వాత అతడే అన్న అంచనాల నుంచి ఇప్పుడు ఎక్కడికో పడిపోయాడు.

వేటు ఖాయమేనా?

ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టంతా అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. సొంత గడ్డపై వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోయింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా తొలి ఇన్నింగ్స్ లో 500 పైగా పరుగులు చేసి మరీ ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తొలి ఇన్నింగ్స్ లో 30, రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు మాత్రమే చేశాడు. వాస్తవానికి పాక్ జట్టులో ముగ్గురు సెంచరీలు చేసిన ఈ మ్యాచ్ లో బాబర్ స్థాయి బ్యాట్స్ మన్ డబుల్ సెంచరీ కొట్టాలి. కానీ, కొంతకాలంగా పేలవ ఫామ్ లో ఉన్న అతడు పరుగులు చేయలేకపోతున్నాడు. దీంతోనే ఇంగ్లండ్ తో రెండో టెస్టులో బాబర్ నుంచి జట్టు నుంచి తప్పిస్తారన్న కథనాలు వస్తున్నాయి.

సెలక్షన్ బోర్డులో మాజీ అంపైర్

అలీమ్ దార్.. మొన్నటివరకు అంతర్జాతీయ అంపైర్. అలాంటివాడిని ఇటీవల పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు సెలక్షన్ కమిటీ సభ్యుడిని చేశారు. ఇలా పాకిస్థాన్ లో తప్ప మరెక్కడా జరగదనే చెప్పాలి. ఇదో బోర్డులో మాజీ ఆటగాళ్లు ఆకిబ్‌ జావెద్‌, అజర్‌ అలీ, అసద్ షఫీఖ్ ఉన్నారు. టీమ్ అనలిస్ట్‌ హసన్‌ చీమాకు కూడా దీనిలో స్థానం కల్పించారు. మేటి బ్యాట్స్ మన మహమూద్‌ యూసఫ్‌ కొద్ది రోజుల కిందట తప్పుకొన్నాడు. సెలక్షన్ కమిటీలో ప్రతి ఒక్క సభ్యుడికి ఓటు హక్కు కల్పించారు. ఇప్పుడు మెజారిటీ సభ్యులు బాబర్ మీద వేటు వేయాలని కోరుతున్నారు. అతడి ఆటపై తీవ్ర అసంతృప్తిగా ఉండడమే దీనికి కారణం. అలీమ్ దార్‌, ఆకిబ్‌ జావెద్‌, అజహర్‌ అలీ అయితే బాబర్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అంటే.. మెజారిటీ సభ్యులు (ముగ్గురు) బాబర్ ను తప్పించాలనే కోరుతున్నారు. ఇప్పటికే వీరు తమ నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్‌ మోహసీన్‌ నక్వీకి చెప్పారని సమాచారం.

ముల్తాన్ పిచ్ పైనా..

పాకిస్థాన్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ జరిగిన ముల్తాన్ లో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా 20 ఏళ్ల కిందట ట్రిపుల్ సెంచరీ చేశాడు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ కొట్టాడు. అయితే, ముల్తాన్ పిచ్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. దీనిని తయారుచేసిన టోనీ హెమ్మంగ్‌ ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక బాబర్ తమ అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని కెప్టెన్ షాన్ మసూద్ అంటున్నాడు. అయితే, షాన్ మసూద్ కెప్టెన్సీకే ఇప్పుడు ఎసరు వచ్చేలా ఉంది. దీంతో అతడు బాబర్ పై వేటు వేయాలన్న సెలక్షన్‌ కమిటీ కఠిన నిర్ణయానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News