పాక్ లో కాదు.. భారత్ లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 18 ఏళ్ల తర్వాత

పాకిస్థాన్ లో జరగాల్సిన టోర్నీ భారత్ కు వస్తోంది..? అదికూడా 18 ఏళ్ల తర్వాత నిర్వహణకు మన దేశం వేదిక కానుంది..

Update: 2024-11-15 08:21 GMT

పాకిస్థాన్ లో జరగాల్సిన టోర్నీ భారత్ కు వస్తోంది..? అదికూడా 18 ఏళ్ల తర్వాత నిర్వహణకు మన దేశం వేదిక కానుంది.. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ కు వెళ్లబోమని భారత్ తేల్చిచెప్పడం.. ఆపై టోర్నీని హైబ్రిడ్ (భారత్ మ్యాచ్ లు వేరే దేశంలో) మోడల్ లో నిర్వహిచేందుకూ అంగీకరించపోవడంతో అసలుకే ఎసరొచ్చింది. వన్డే క్రికెట్ లో గత ఏడాది ప్రపంచ కప్ ను నిర్వహించింది భారత్. ఆ కప్ తర్వాత అంతటి ముఖ్యమైన టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ. దీనికి భారత్ వేదిక కానుంది.

పాకిస్థాన్ లో జరగాల్సింది..

షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ లో జరగాల్సి ఉంది. కానీ, ఉగ్రవాదానికి ఊతం, భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆ దేశం ధోరణి మారే వరకు అసలు పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లే వద్దనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. కానీ, పాకిస్థాన్ మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సిందే అంటోంది. హైబ్రిడ్ మోడల్ కూ ఒప్పుకోలేదు. దీంతో పరిస్థితి మారిపోయింది.

యూఏఈలో అయినా.. దక్షిణాఫ్రికాలోనైనా

వాస్తవానికి ఛాంపియన్స్ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ లను యూఏఈలో నిర్వహిస్తే చాలనే ప్రతిపాదనకూ పాకిస్థాన్ మొగ్గుచూపలేదు. విధి లేని పరిస్థితుల్లో టోర్నీని మార్చాల్సి వచ్చింది. కాగా, 2006లో భారత్ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మరెప్పుడూ వేదిక కాలేదు. చివరిగా 2013, 2017లో ఇంగ్లండ్ లో టోర్నీ జరిగింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ వెళ్లిపోతే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అది పెద్ద దెబ్బే. టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలిస్తారని మరో వాదన కూడా ఉంది. అది జరిగినా పాక్ కు నష్టమే. ఆ నష్టం విలువ రూ.548 కోట్లు అని అంచనా. భారత్ వంటి జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ ఒప్పుకోదు. అందుకనే అసలు భారత్ లోనే టోర్నీ నిర్వహిస్తే పోలా? అనే ఆలోచన చేస్తోందట. దీనిపై బీసీసీఐ, ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అంతేగాక హైబ్రిడ్ మోడల్ పై పాక్ డిసెంబరు 1లోగా తమ అభిప్రాయాన్ని చెప్పాలి. ఆ తర్వాత ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు చేపడతారు. ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మారడం ఖాయం.

కొసమెరుపు: భారత్ లో నిరుడు జరిగిన వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనడంపై పాకిస్థాన్ పెద్ద రాద్ధాంతమే చేసింది. ఎలాగోలా ఆడింది. ఇప్పుడు తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రాకపోవడంపై మాత్రం గుర్రుగా ఉండడం ఖాయం. చివరగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకుంది. అది కూడా ఫైనల్లో భారత్ పై నెగ్గడం ద్వారా..

Tags:    

Similar News