టీమిండియాను గెలిపించిన కీపర్.. తెలుగు క్రికెటర్ స్థానం గల్లంతే..?
ఇక బ్యాటింగ్ కు దిగింది రెండోసారి మాత్రమే. 23 ఏళ్ల జురెల్ వికెట్ కీపింగ్ నైపుణ్యమే కాదు.. బ్యాటింగ్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి తప్పుకొని పదేళ్లవుతోంది.. సాహా వంటి వారు వెటరన్ అయిపోయారు.. పంత్ వచ్చాడు కానీ.. విధి అతడిని వెనక్కులాగింది.. ఇషాన్ కిషన్ చేజేతులా చెడగొట్టుకున్నాడు.. మరి టీమిండియాను టెస్టుల్లో నిలిపే వికెట్ కీపర్ ఎవరు..? ఈ అన్వేషణలో కనిపించాడు తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్. దేశవాళీల్లో దుమ్మురేపుతూ కీపింగ్ నైపుణ్యంతో టీమిండియా తలుపులు తట్టాడు. దీంతో అతడికి మంచి అవకాశాలే వచ్చాయి. కానీ, అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. కీపర్ గా ఆకట్టుకున్నప్పటికీ.. బ్యాట్స్ మన్ గా ఫెయిలయ్యాడు. ఇప్పుడు వెనక్కుతిరిగి చూస్తే అతడి స్థానం గల్లంతయ్యే ప్రమాదం నెలకొంది. దీనిని మరో యువ కీపర్ రెండు చేతులా లాగేసుకుంటున్నాడు.
ధోనీ సొంత నగరం రాంచీలో
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో టీమిండియాను గెలిపించింది ఎవరు..? ఓపెనర్లు జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మనా? లేక స్పిన్నర్లు జడేజా, అశ్వినా?.. వీరెవరూ కాదు.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్. అతడు అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చింది రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టులోనే. ఇక బ్యాటింగ్ కు దిగింది రెండోసారి మాత్రమే. 23 ఏళ్ల జురెల్ వికెట్ కీపింగ్ నైపుణ్యమే కాదు.. బ్యాటింగ్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జురెల్.. ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి భారత ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరిన వేళ పట్టుదలతో నిలిచాడు. అప్పటికి జట్టు స్కోరు 177/7. కానీ.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా క్రీజులో పాతుకుపోయాడు. 90 పరుగులు చేసి.. జట్టును 307 పరుగులకు చేర్చాడు. కెరీర్ తొలి సెంచరీని మిస్ అయినా.. అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే.. జురెల్ విఫలమై ఇంగ్లాండ్ ఆధిక్యం 100 దాటి ఉంటే టీమిండియాపై ఒత్తిడి పడేది. అయితే, టెయిలెండర్లతో కలిసి 130 పరుగులు జత చేసిన ధ్రువ్ ఆ ఇబ్బంది లేకుండా చేశాడు.
తండ్రి యుద్ధ వీరుడు.. కొడుకు పోరాట యోధుడు
టీమిండియా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ధ్రువ్ 211 నిమిషాలు క్రీజులో నిలిచి 149 బంతులాడాడు. అర్ధశతకం తర్వాత కార్గిల్ యుద్ధ వీరుడైన తండ్రి నీమ్ చంద్ కోసం సెల్యూట్ చేశాడు. ఓపికతో ఆడడమే కాక.. అలవోకగా బౌండరీలూ కొట్టిన ధ్రువ్.. అరంగేట్ర టెస్టు (రాజ్ కోట్)లోనూ రాణించాడు. జట్టు 331/7తో ఉన్న దశలో 46 పరుగులు చేశఆడు. కాగా, ధ్రువ్ కీపింగ్ నైపుణ్యం కూడా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో అండర్సన్ రివర్స్ స్వీప్ నకు ప్రయత్నించగా.. తొడ, బ్యాట్ కు తాకి వచ్చిన బంతిని మెరుపు వేగంతో అందుకున్నాడు.
పంత్ తర్వాత ఇతడే..
రిషభ్ పంత్ ఏడాదికి పైగా జట్టుకు దూరమయ్యాడు. అప్పటినుంచి టెస్టుల్లో వికెట్ కీపర్ కోసం జట్టు వెదుకుతోంది. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌తో పాటు ఆఖరికి కేఎల్ రాహుల్ కూ టెస్టుల్లో కీపింగ్ బాధ్యతలు అప్పగించింది. అయితే, అందరూ విఫలమయ్యారు. పంత్ తిరిగి వస్తుండగా.. అతడికి దీటైన వికెట్ కీపర్ బ్యాటర్ గా ధ్రువ్ కనిపిస్తున్నాడు. విశేషం ఏమంటే.. ఈ టెస్టు సిరీస్ కు ముందు ధ్రువ్ పేరు ఎవరికీ తెలియదు. భరత్, కిషన్ ఉండడమే అందుకు కారణం. అయితే, అవకాశాలు అందరికీ వస్తాయి అనేలా ధ్రువ్ ను లక్ వరించింది. భరత్ వైఫల్యం, కిషన్ పొగరుతో తుది జట్టుకు దూరమయ్యారు. రాహుల్ స్పెషలిస్ట్ కీపర్ కాదు. అందులోనూ అతడికి గాయమైంది. దీంతోనే ధ్రువ్ కు చాన్సొచ్చింది.
కొసమెరుపు: ఈ సిరీస్ కు ముందు ధ్రువ్ రోజుకు 140 ఓవర్ల పాటు బ్యాటింగ్ సాధన చేశాడట. అదికూడా వేర్వేరు స్పిన్ పిచ్ లపై నాలుగు గంటల పాటు చేశాడట. తుది జట్టులో చోటుపై ఆశ లేకున్నా అతడు చేసిన శ్రమ వేస్ట్ కాలేదు. చాన్నాళ్లుగా ఆడిన హైదరాబాద్ పిచ్, సొంతగడ్డ విశాఖలోనూ భరత్ వైఫల్యంతో సెలక్టర్లు ధ్రువ్ వైపు చూశారు. తొలి ఇన్నింగ్స్ లో విలువైన 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 39 నాటౌట్ బ్యాట్ తో జట్టును గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గానూ నిలిచాడు. అందుకే ధ్రువ్ మరో ధోనీగా ఎదుగుతాడంటూ క్రికెట్ దిగ్గజం గావస్కర్ అంటున్నాడు. వికెట్ల వెనుక గ్లోవ్స్ తో, వికెట్ల ముందు బ్యాట్ తో అచ్చం ధోనీలాగానే ఆలోచిస్తున్నాడని చెబుతున్నాడు. అతడు ఇలాగే రాణిస్తే భరత్ స్థానం గల్లంతైనట్లే.