అనంతపురానికి అంతర్జాతీయ క్రికెటర్లు.. అందులో కోహ్లీ కూడా?
భారత దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలుకానుంది. ఇప్పటికే దులీప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది.
భారత దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలుకానుంది. ఇప్పటికే దులీప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. ఇక మ్యాచ్ లు జరగడమే తరువాయి. అయితే, ఈ సారి దులీప్ ట్రోఫీ ఫార్మాట్ మారింది. గతంలో నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అంటూ జోన్ ల వారీగా ఈ టోర్నీ జరిగేది. కానీ ఇప్పుడు జట్లను ఏ, బీ, సీ, డీలుగా విభజించారు. అందులోనూ అంతర్జాతీయ క్రికెటర్లు అందరూ పాల్గొనే నిబంధనను విధించారు. దీంతో దులీప్ ట్రోఫీకి స్టార్ కళ వచ్చింది.
రాయల సీమలో క్రికెట్ కళ
రాయలసీమలో అత్యంత కరువు జిల్లా అనంతపురం. అలాంటి జిల్లాకు క్రికెట్ కళ వచ్చింది. ఆ జిల్లాలో రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చొరవతోనే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు సత్యసాయిబాబాతో ప్రముఖంగా నిలిచిన అనంతపురం పేరు మళ్లీ ఇన్నాళ్లకు వినిపిస్తోంది. దీనికి కారణం క్రికెట్ అనే చెప్పాలి. కాగా, పుట్టపర్తి సత్యసాయి జీవించి ఉన్న కాలంలోనే అద్భుతమై క్రికెట్ స్టేడియం కట్టారు.
ఎల్లుడినుంచి సందడే సందడి
అనంతపురంలో గురువారం నుంచి దులీప్ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ లో పాల్గొనేందుకు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ఇప్పటికే చేరుకున్నారు. ఇటీవల టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని పేసర్ అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తో పాటు భారత జాతీయ జట్టు సభ్యులైన శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, పేసర్ తుషార్ దేశ్ పాండే తదితరులున్నారు. వీరి సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బస్సులో అనంతపురం వచ్చారు. ఇక్కడి రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) మైదానంలో గురువారం ఇండియా-సి, ఇండియా-డి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండడం, వారిని చూసేందుకు అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. క్రికెటర్లకు త్రీస్టార్ హోటల్ లో బస కల్పించారు.
కొసమెరుపు: పుట్టపర్తిలో సత్యసాయి జీవించి ఉండగా.. సచిన్ అంతర్జాతీయ క్రికెటర్ గా వచ్చి అక్కడి స్టేడియంలో మ్యాచ్ ఆడారు. సచిన్.. పుట్టపర్తి సత్యసాయికి వీర భక్తుడు కావడం.. ఆయన కోరిక మేరకు ఇక్కడకు వచ్చి క్రికెట్ ఆడారు. ఇక టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా దులీప్ ట్రోఫీ మ్యాచ్ కు వస్తున్నాడా? అనేదేగా సందేహం..? కోహ్లితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు.