నోటీసుల రచ్చ.. ముదిరిన ఇద్దరు భారత క్రికెటర్ల వివాదం
ఇద్దరూ ప్రతిభావంతులైన ఆటగాళ్లే.. ఇద్దరూ టి20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులే.. ఇద్దరూ వివాదాస్పదులే.. ఆ ఇద్దరూ ఇప్పుడు కేసుల రచ్చకెక్కారు.
ఇద్దరూ ప్రతిభావంతులైన ఆటగాళ్లే.. ఇద్దరూ టి20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులే.. ఇద్దరూ వివాదాస్పదులే.. ఆ ఇద్దరూ ఇప్పుడు కేసుల రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు బయటకు రావడంతో వివాదం ముదిరింది. చివరకు ఇది ఎక్కడకు దారితీస్తుందో కానీ.. పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.
టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆవేశపరుడన్న సంగతి తెలిసిందే. అయితే, అతడు మహా ముక్కుసూటి. ఓపెనర్ కు ఉండాల్సిన టెంపర్ మెంటే అది. కానీ, వ్యక్తిగతంగానూ అదే టెంపర్ మెంట్ తో ఉండడం సరికాదు. మైదానంలో అంటే.. ప్రత్యర్థిని ఢీ అంటే ఢీ అనడానికి పనికి వస్తుంది. బయట కూడా అలానే ఉంటానంటే కుదరదు. మరోవైపు మాజీ పేసర్ శ్రీశాంత్ సంగతి అందరికీ తెలిసిందే. మంచి పేస్ తో బౌలింగ్ చేయగల అతడు.. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధానికి గురయ్యాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ లోనే హర్భజన్ సింగ్ తో చెంప దెబ్బలు తిన్నాడు. ఇక అతడి అంతర్జాతీయ కెరీర్ కూడా పడుతూ లేస్తూ సాగింది. అయితే, శ్రీశాంత్, గంభీర్ మధ్య ఉన్న పోలిక ఏమంటే.. ఇద్దరూ 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులు. 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్థాన్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ కొట్టిన బంతిని ఫైన్ లైగ్ లో అత్యంత జాగ్రత్తగా ఒడిసిపట్టింది శ్రీశాంతే కావడం విశేషం. ఇక గంభీర్ 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్లో అత్యంత కీలకమైన 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 2011 వన్డే కప్ ఫైనల్లో 95 పరుగులతో రాణించాడు.
ఇంతకూ ఏం జరిగింది..?
ఇటీవల రిటైర్డ్ ఆటగాళ్లతో కూడిన జట్ల మధ్య లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్ సీ) జరిగింది. దీంట్లో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీశాంత్ బౌలింగ్ వేసిన రెండో ఓవర్, ఆరో ఓవర్ సమయంలో వీరిద్దరి మధ్య గొడవ రేగింది. తన బౌలింగ్‌లో గంభీర్ 6, 4 కొట్టడంతో .. శ్రీశాంత్ అతడి వైపు తీక్షణంగా చూశాడు. గంభీర్ కూడా వెనక్కితగ్గలేదు. వీరిద్దమి మధ్య వాగ్వాదం జరగ్గా ఈ వీడియో వైరల్ అయింది. మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ మాట్లాడుతూ.. గంభీర్ సహచరులతో ఎప్పుడూ గొడవలకు దిగుతాడని.. అతడు మిస్టర్ ఫైటర్ అని అభివర్ణించాడు. కారణంగా లేకుండానే గౌతీ గొడవ పడుతుంటాడని ఆరోపించాడు. సీనియర్ ఆటగాళ్లను సైతం గౌరవించడన్నాడు. తాను రెచ్చగొట్టకపోయినా.. మర్యాద లేకుండా తను పదే పదే ఏదో అన్నాడన్నాడు. మైదానంలో గంభీర్ మాట్లాడిన మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. గంభీర్ ఏమన్నాడో మీకు కచ్చితంగా చెబుతానని పేసర్ తెలిపాడు. గంభీర్ అన్న మాటలకు తాను హర్ట్ అయ్యానని, తన ఫ్యామిలీ, తనను ఇష్టపడేవాళ్లు నొచ్చుకున్నారన్న శ్రీశాంత్.. గంభీర్‌ను తాను ఒక్క మాట కూడా అనలేదన్నాడు. కానీ గౌతీ మాత్రం తనకు అలవాటైన పద్ధతి ప్రకారం తనను అంటూనే పోయాడన్నాడు. ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడిన శ్రీశాంత్.. తనను గంభీర్ ఏమన్నాడనేది త్వరలోనే మీకు తెలుస్తుందన్నాడు. గౌతీ కామెంటేటర్‌గా వ్యవహరించే సమయంలోనూ విరాట్ గురించి మాట్లాడడని.. బ్రాడ్‌కాస్టర్ కోహ్లి ప్రస్తావన తెచ్చినా సరే.. విరాట్ భాయ్ గురించి తప్పితే మిగతా విషయాలన్నీ మాట్లాడతాడంటూ శ్రీశాంత్ ఆరోపించాడు.
విషయం నోటీసుల వరకు వెళ్లింది
లెజెండ్స్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మధ్య జరిగిన వాగ్వాదం లీగల్ నోటీసుల వరకు వెళ్లింది. శ్రీశాంత్ సోషల్ మీడియాలో ఉంచిన పోస్టుకు గాను అతడికి లెజెండ్స్ లీగ్ నిర్వాహకులు లీగల్ నోటీసులు పంపారు. శ్రీశాంత్ కాంట్రాక్టును ఉల్లంఘించాడని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఉంచిన వీడియోలను తొలగించిన తర్వాతనే శ్రీశాంత్ ఏ విషయమైనదీ చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. కాగా, గంభీర్ గతంలో విరాట్ కోహ్లి తో మైదానంలోనే గొడవ పడిన సంగతి తెలిసిందే. మాజీ కెప్టెన్ ధోని అంటే గంభీర్ కు సదభిప్రాయం లేదు. ధోనీ గురించి పరోక్షంగా గతంలో వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు పలువురు పాకిస్థాన్ క్రికెటర్లతోనూ గంభీర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగుతుంటాడు. పాక్ మాజీ కెప్టెన్ ఆఫ్రిదీతో అయితే ఘర్షణకు దిగిన స్థాయిలో గంభీర్ వ్యాఖ్యలు ఉంటాయి.