ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్.. రికార్డులెన్నో!
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన భారత్ – న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచులో పలు రికార్డులు బద్దలయ్యాయి
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన భారత్ – న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచులో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో బ్యాటింగ్ రికార్డులతోపాటు బౌలింగ్ రికార్డులు కూడా ఉండటం గమనార్హం.
ఇండియా – న్యూజిలాండ్ మ్యాచ్ రికార్డులివే..
– వన్డేల్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ తన వన్డే కెరీర్ లో 49 సెంచరీలు సాధించగా విరాట్ 50 సెంచరీలతో ఆ రికార్డును తిరగరాశారు. సచిన్ 452 ఇన్నింగ్సుల్లో 49 సెంచరీలు చేస్తే విరాట్ కేవలం 279 ఇన్నింగ్సుల్లోనే 50 సెంచరీలు సాధించాడు.
– వరల్డ్ కప్ ల్లో వరుసగా 8 సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాట్సమన్ గా విరాట్ కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్, షకీబ్ ఉల్ హసన్ పేరిట ఉంది. వీరు వరుసగా ఏడుసార్లు 50+ స్కోర్లు చేశారు.
– అలాగే ఒక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2003 వరల్డ్ కప్ లో 673 పరుగులు చేయగా దాన్ని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. 711 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్సమన్ గా కొనసాగుతున్నాడు.
–అలాగే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్సమన్ గా విరాట్ మరో రికార్డును అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినవారిలో వరుసగా సచిన్ (18,426), సంగక్కర (14,234) ఉన్నారు. వీరి తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ చేరాడు. విరాట్ 13,794 పరుగులతో ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ (13,704) ను వెనక్కి నెట్టాడు.
–అదేవిధంగా వరల్డ్ కప్ ల్లో నాకౌట్ మ్యాచులు అంటే.. క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డును తిరగరాసింది. భారత్ ఈ మ్యాచులో 397 పరుగులు చేసింది. ఈ రికార్డు ఇప్పటివరకు న్యూజిలాండ్ పేరిట ఉండేది. న్యూజిలాండ్ 2015 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో వెస్టిండీస్ పై 393 పరుగులు చేసింది.
– ఇక ఒక వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా మహ్మద్ షమి నిలిచాడు. షమి ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 23 వికెట్లు తీశాడు. 2011 వరల్డ్ కప్ లో జహీర్ ఖాన్ 21 వికెట్లు తీయగా ఆ రికార్డును షమీ బ్రేక్ చేశాడు.
– ఒక వన్డేలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా షమీ నిలిచాడు. భారత్ – న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో షమీ 7 వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. గతంలో ఈ రికార్డు స్టువర్ట్ బిన్నీ పేరుతో ఉంది. అతడు బంగ్లాదేశ్ పై ఆరు వికెట్లు తీశాడు.
– అలాగే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్సమన్ గా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. 67 బంతుల్లోనే అయ్యర్ శతకం బాదాడు. 2007 వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా బ్యాట్సమన్ గిల్ క్రిస్ట్ 72 బంతుల్లో సెంచరీ చేశాడు.
– వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచులో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్ లో సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ 19 సిక్సర్లు బాదింది. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2015 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో వెస్టిండీస్ 16 సిక్సర్లు కొట్టింది.
– ప్రపంచ కప్ మ్యాచుల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించడంలో మహ్మద్ షమి మరో రికార్డు సృష్టించాడు. నాలుగుసార్లు ఈ ఫీట్ ను సాధించాడు. గతంలో స్టార్క్ (ఆస్ట్రేలియా) మూడుసార్లు ఈ ఘనతను సాధించాడు.
– అలాగే వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా మహ్మద్ షమి ఇంకో రికార్డు సృష్టించాడు. 17 మ్యాచుల్లోనే 50 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ 19 మ్యాచుల్లో 50 వికెట్లు తీశాడు.
– ఇక వరల్డ్ కప్ ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్సమన్ గా, ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డులు నెలకొల్పాడు. ఓవరాల్ గా వరల్డ్ కప్ ల్లో రోహిత్ శర్మ 51 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లోనే 28 సిక్సర్లు కొట్టాడు. గతంలో ఈ రికార్డులు క్రిస్ గేల్ పేరుతో ఉన్నాయి. గేల్ 2015 వరల్డ్ కప్ లో 26 సిక్సర్లు కొట్టాడు. అలాగే ఓవరాల్ గా వరల్డ్ కప్ ల్లో గేల్ 49 సిక్సర్లు బాదాడు. ఆ రికార్డులను హిట్ మ్యాన్ తుడిచిపెట్టేశాడు.