46కే ఆలౌట్.. మీ ఇద్దరికీ 35 దాటాయి.. టీమ్ ఇండియా స్టార్లపై దారుణ ట్రోలింగ్

రోహిత్ 2 పరుగులు చేయగా, 8 ఏళ్ల తర్వాత వన్ డౌన్ లో వచ్చిన కోహ్లి డకౌట్ అయ్యాడు.

Update: 2024-10-17 13:33 GMT

సొంతగడ్డపై రెండు ఓవర్లలో చేసినన్ని పరుగులు కూడా జట్టంతా చేయలేదు.. కనీసం ఒక్కరైనా కుదురుగా క్రీజులో నిలవలేదు.. ప్రధాన బ్యాట్స్ మెన్ ముగ్గురు డకౌట్.. మొత్తం 46కే ఆలౌట్.. దీంతో టీమ్ ఇండియాపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను అభిమానులు టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటికే 35 ఏళ్లు పైబడిన వీరు ఇక మీదట టెస్టుల్లోనూ తప్పుకోవాలని సూచిస్తున్నారు. జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ గెలచుకున్న అనంతరం రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలకడాన్ని సూచిస్తూ.. అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. వీరిద్దరూ ఎలా టార్గెట్ అయ్యారంటే..?

కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టు వేదిక బెంగళూరు. బ్యాటర్లకు స్వర్గధామం ఇక్కడి చిన్నస్వామి మైదానం పిచ్. కానీ, రోహిత్, కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. దీంతోనే అభిమానులకు దొరికిపోయారు.

రోహిత్ 2 పరుగులు చేయగా, 8 ఏళ్ల తర్వాత వన్ డౌన్ లో వచ్చిన కోహ్లి డకౌట్ అయ్యాడు.

వర్షం పడిన వేళ బ్యాటింగా?

బెంగళూరులో బుధవారమే మొదలు కావాల్సిన టెస్టు వర్షం కారణంగా గురువారం నుంచి మొదలైంది. గురువారం టాస్ నెగ్గిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడే పెద్ద తప్పు చేశాడు. మబ్బులు కమ్మిన వాతావరణంలో మొదట బ్యాటింగ్ చేయడం.. అందులోనూ కివీస్ కు మంచి పేసర్లుండడంతో అభిమానులు రోహిత్ ను ఆటాడుకుంటున్నారు. ఇక ఓపెనర్ గా, కెప్టెన్ గా బాధ్యతగా ఆడాల్సిన రోహిత్ వికెట్‌ ఇచ్చేయడంపై మండిపడుతున్నారు. దీనికిముందు బంగ్లాదేశ్‌ తో టెస్టులో 30 పరుగులు కూడా చేయలేదని గుర్తుచేశారు.

ఇవీ ఈటెల్లాంటి కామెంట్లు..

-రోహిత్, కోహ్లి.. టి20ల్లాగే టెస్టుల్లోనూ వైదొలిగి కుర్రాళ్లకు చోటివ్వండి..

-కోహ్లిని బ్యాడ్ లక్ వెంటాడింది.. రోహిత్ ది మాత్రం దారుణమైన షాట్.

-పిచ్ ఎలా ప్రవర్తిస్తున్నదో తెలియని పరిస్థితుల్లో అనవసర షాట్లు అవసరమా..?

-ఇక మీ టెస్టు క్రికెట్‌ చాలించండి.. యువతకు మార్గం చూపించండి

-పది ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ కూడా చేయని కోహ్లి.. జట్టుకు భారం. నష్టం. ఫ్యాబ్‌ 4 (రూట్, స్మిత్, విలియమ్సన్, కోహ్లి) నుంచి తొలగించాల్సి ఉంటుంది.

-రోహిత్‌ దూకుడులో తప్పులేదు. పరిస్థితులు అనుకూలించాలిగా..? పిచ్ బౌలింగ్ కు సహకరిస్తోంది.. ఓపిక పట్టాలిగా?

Tags:    

Similar News