ఆ ఒక్క మ్యాచ్ కే రిజర్వ్ డే.. అదీ దాయాదుల సమరం అంటే.

రిజర్వ్ డే ఇచ్చారోచ్ భారత్ –పాక్ మ్యాచ్ విషయంలో ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-09-08 14:30 GMT

ప్రపంచంలో ఏ జట్టు మరే జట్టుతో ఆడినా రాని క్రేజ్ ఆ రెండు దేశాలు తలపడితే వస్తుంది. అభిమానుల ఆదరణ కొరవడి మైదానం ఖాళీగా ఉంటుందన్న ఆందోళన లేదు.. ఇతరత్రా పోటీకి తక్కువేం ఉండదు. దీంతోనే ఆ రెండు జట్ల మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. టీవీల ముందు అభిమానులు నిండిపోతారు. కానీ, ఇలాంటి మ్యాచ్ కూ విలన్ ఒకడున్నాడు. అతడు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటే మొత్తానికి ముంచెత్తనూ వచ్చు. అతడే ‘‘వరుణుడు’’.

వన్డే ప్రపంచ కప్ ముంగిట భారత్ పాకిస్థాన్ సహా ఆసియా జట్లు ఆసియా కప్ ఆడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా పాక్.. భారత్ లో పర్యటించబోమని చెప్పడంతో లంకలో మ్యాచ్ లు ఆడిస్తున్నారు.

అయితే, ప్రస్తుత సమయంలో లంకలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి కాబట్టి ఇది సరికాదని అంటున్నారు. గత వారం భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఒక్కటే (భారత్ ) ఇన్నింగ్స్‌ సాధ్యమైంది. పల్లెకెలెలో జరిగిన మూడు మ్యాచ్‌లూ వర్షం ముప్పును ఎదుర్కొన్నాయి. ఇప్పుడు వేదిక కొలంబోకు మారింది. సెప్టెంబరు 17న ఫైనల్‌ కూడా అక్కడే.

కానీ మ్యాచ్‌లు సజావుగా సాగడంపై ఆందోళన మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. రెండు వారాలుగా కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఆదివారం సూపర్‌-4 మ్యాచ్‌కూ వాన ముప్పుది. ఆ రోజంతా వాన పడే అవకాశం 75 శాతానికి ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. సూపర్‌-4 మ్యాచ్‌ల వేదికను హంబన్‌టోటకు మార్చాలని శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) ప్రతిపాదించినప్పటికీ ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఒప్పుకోలేదు.

రిజర్వ్ డే ఇచ్చారోచ్ భారత్ –పాక్ మ్యాచ్ విషయంలో ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్‌-4 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ప్రకటించింది. ఆదివారం మ్యాచ్ కు వానం అంతరాయం కలిగిస్తే. సోమవారంను రిజర్వ్‌ డేగా ప్రకటించింది. ముందురోజు ఎన్ని ఓవర్ల వద్ద మ్యాచ్‌ ఆగిపోయిందో మరుసటి రోజు అక్కడి నుంచే తిరిగి ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ టికెట్లు రిజర్వ్‌ డే రోజున కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. గమనార్హం ఏమిటంటే.. సూపర్‌-4లో భారత్, పాక్ మ్యాచ్‌ కే రిజర్వ్ డే ఇచ్చారు.

అదీ.. దాయాదుల మధ్య సమరం అంటే..? కాగా, సూపర్ 4లో టాప్ లో నిలిచిన రెండు జట్లు ఫైనల్స్ కు వెళ్తాయి. భారత్.. శ్రీలంక, బంగ్లాదేశ్ లనూ ఎదుర్కొనాల్సి ఉంటుంది. పాక్ తప్ప ఈ రెండింటిపైనా మనకు గెలుపు కష్టమేం కాదు. కాబట్టి భారత్-పాక్ ఫైనల్ల తలపడినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే.. ఒకే టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు మూడుసార్లు తలపడిన అరుదైన సందర్భాన్ని చూడొచ్చు.

Tags:    

Similar News