టీమిండియా "టాప్" గేర్.. జెర్సీలు మార్చుకునే పనే లేదు..
కాగా, టాపార్డర్ చెలరేగితే ఆ జట్టుకు విజయం దాదాపు ఖాయమైనట్లే. చక్కటి ఆరంభాన్ని మిడిలార్డర్ సద్వినియోగం చేస్తే గెలిచేసినట్లే.
ఏ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో అయినా టాపార్డర్ చాలా కీలకం. ఓపెనర్లు ప్లస్ వన్ డౌన్ బ్యాట్స్ మన్ ను కలిపి టాపార్డర్ అంటారు. కొత్త బంతిని చితక్కొట్టగల.. ఫీల్డర్ల తలపై నుంచి బంతిని పంపగల బ్యాట్స్ మెన్ ఓపెనర్లుగా దిగుతారు. జట్టులో నంబర్ వన్ బ్యాట్స్ మన్ వన్ వన్ డౌన్ లో వస్తాడు. వీరి తర్వాత 4,5 6 స్థానాలు మిడిలార్డర్ గా చెబుతారు. 7 నుంచి 10వ నంబరు బ్యాట్స్ మెన్ ను లోయరార్డర్ గా పేర్కొంటారు. కాగా, టాపార్డర్ చెలరేగితే ఆ జట్టుకు విజయం దాదాపు ఖాయమైనట్లే. చక్కటి ఆరంభాన్ని మిడిలార్డర్ సద్వినియోగం చేస్తే గెలిచేసినట్లే.
దుమ్ము దులిపేస్తోన్న టాపార్డర్ వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా టాపార్డర్ దుమ్ము రేపుతోంది. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో మాత్రమే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలమయ్యారు. అయితే, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ నిలదొక్కుకుని విజయం అందించారు. ఇక ఆ తర్వాతి మ్యాచ్ నుంచి మన టాపార్డర్ కు తిరుగుండడం లేదు. అఫ్ఘానిస్థాన్ తో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ చెలరేగి సెంచరీ (131) కొట్టాడు. ఆ మ్యాచ్ లో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా రాణించాడు.
ఇక పాకిస్థాన్ తో మ్యాచ్ లో రోహిత్ ధాటిని అందరూ చూశారు. నిజానికి ఆ మ్యాచ్ ద్వారా తిరిగొచ్చిన యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (16) కూడా ఇన్నింగ్స్ ను బాగానే మొదలుపెట్టాడు. చకచకా నాలుగు ఫోర్లు కొట్టాడు. కానీ, అద్భుత క్యాచ్ అవుటయ్యాడు. కోహ్లి కూడా సౌకర్యంగానే కనిపించాడు. మూడు ఫోర్లు కొట్టి ఊపుమీద ఉండగా వికెట్ పోగొట్టుకున్నాడు. అయితే, శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశాడు.
బంగ్లాపై చెలరేగి..గురువారం బంగ్లాదేశ్ పై ఓ మోస్తరు లక్షాన్ని ఛేదించడంలో టీమిండియా టాపార్డర్ ఆడిన తీరు ఎంతైనా మెచ్చుకోదగ్గది. కెప్టెన్ రోహిత్ శర్మ భీకర దాడికి యువ గిల్ కళాత్మక విధ్వంసం తోడైంది. ఆపై కింగ్ కోహ్లి వేట మొదలుపెట్టాడు. అయ్యర్ అనవసర షాట్ కు వికెట్ పారేసుకున్నా.. కేఎల్ రాహుల్ దూకుడుతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 257 పరుగుల లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించేసింది. కాగా, టీమిండియా టాపార్డర్ దూకుడు.. మిగిలిన బ్యాటర్లకు ఉపశమనం కలిగిస్తోందట. ఎంతగా అంటే.. డగౌట్లో నలుగురు తప్ప అందరూ నీలం రంగులు జెర్సీలు తీసేసి.. ఆరెంజ్ కలర్ డ్రెస్సుల్లో సేదదీరుతున్నారు.
ఓపెనర్లు.. వన్ డౌన్ ,నాలుగో నంబరు బ్యాట్స్ మెన్ తప్ప మిగతా బ్యాటర్లందరూ కబుర్లు చెప్పుకొంటున్నారు. బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాదేమో అన్నంత కులాసాగా కనిపిస్తున్నారు. ప్రపంచ కప్ మిగతా జట్ల కంటే టీమిండియా టాపార్డర్ చూపుతున్న నిలకడ అసాధారణంగా ఉంది. రోహిత్, కోహ్లి గొప్ప ఫామ్ లో ఉన్నారు. ఈ కప్ లో అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాలు రోహిత్ (265), కోహ్లి (259)వే. నాలుగు మ్యాచ్ లలో మూడు ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 150 పరుగులు చేశాడు. ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ఇక ఆసీస్ తో తప్ప భారత్ మిగతా మూడు మ్యాచ్ లలో మూడు కంటే ఎక్కువ వికెట్లు కోల్పోనే లేదు. ఆస్ట్రేలియాపైన కూడా నాలుగు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్నారు. అఫ్గాన్ పై 8, పాకిస్థాన్ పై 7, బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.