రోహిట్ తుఫాను... భారీ వర్షానికి తడిచి తీవ్ర గాలులకు వణికిన పాక్!
శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ తలపడింది ఎవరితో? మ్యాచ్ మొదలవ్వక ముందువరకూ పాకిస్థాన్ అనే చెప్పారు!
శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ తలపడింది ఎవరితో? మ్యాచ్ మొదలవ్వక ముందువరకూ పాకిస్థాన్ అనే చెప్పారు! మ్యాచ్ స్టార్ట్ అయిన అనంతరం 40 పరుగులు వచ్చే వరకూ ఆ టీం పాకిస్థానే అని అంతా అనుకున్నారు! కానీ... బూమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్ దీప్, జడేజా ల బౌలింగ్ కి తర్వాత తెల్సింది... ఇది పాకిస్థాన్ కాదు, పసి కూన అని!
అవును... తొలుత బ్యాటింగ్ కి దిగిన పాక్ తొలి వికెట్, రెండో వికెట్ భాగస్వామ్యాల వరకూ బలగానే కనిపించింది. భారీ షాట్లు ఆడుతూ, భారత్ ఫేసర్స్ ని సమర్ధంగా ఎదుర్కొంటూ ఆడింది. ఆ తర్వాత మొదలైంది.. సిరాజ్ మొదలు పెట్టాడు.. మిగిలినవాళ్లు కంటిన్యూ చేసి, ఖతం చేశారు! దీంతో... భారత్ సీమర్లు, స్పిన్నర్ల దాటికి వర్షలో తడిచిన పక్షి చలిగాలికి వణికినట్లుగా వణికిపోయారు పాక్ బ్యాటర్లు!
ఇలా కిందా మీదా పడిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. ఇండియన్ బౌలర్స్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... సిరాజ్, పాండ్యా, కుల్దీప్, జడేజాలు తలా 2 వికెట్లు తీసి పాక్ ని కుప్పకూల్చడంలో తలో చెయ్యీ వేశారు. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగింది.
ఈ సమయంలో.. "ఇది బౌలింగ్ పిచ్ అయ్యి ఉంటుంది.. అందుకే మన బ్యాట్స్ మెన్స్ ఇబ్బంది పడ్డారు.. నెక్స్ట్ మన బౌలర్లు భారత్ బ్యాట్స్ మెన్స్ ని దడదడలాడిస్తారు".. అని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఉంటారు. ఆ సమయంలో రోహిత్ శర్మ, గిల్ లు బ్యాట్ లు చేతపట్టి మైదానంలో అడుగుపెట్టారు. ఈ సమయంలో మొదటి నుంచీ దూకుడుగా కనిపించిన గిల్ (16) తొందరగానే అవుటయ్యాడు.
అనంతరం మొదలైంది... అహ్మదాబాద్ వేదికగా రోహిత్ అనే అల్పపీడనం. అనంతరం తీవ్ర తుఫాన్ గా మారింది. ఈ ప్రభావానికి పాకిస్థాన్ సీమర్లు కూలిపోగా, స్పిన్నర్లు రాలిపోయారు! కాస్త తేరుకుని చూసే సరికి 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. ఈ సమయంలో మరింత తీవ్ర గాలులు మొదలయ్యాయి.
ఆ తర్వాతా పాక్ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్ లు బాదిన రోహిత్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఇలా 63 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 86 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికే జట్టు విజయతీరాలకు చేరిపోయింది! ఈ మ్యాచ్ లో మరోసారి రాణించడంతో... రోహిత్ మరికొన్ని రికార్డులు నెలకొల్పాడు.
ఈ మ్యాచ్ లో ఆరు సిక్స్ లు బాదిన రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇందులో భాగంగా... వన్డేల్లో 300 సిక్స్ లు కొట్టిన అతి తక్కువమంది ఆటగాళ్ల క్లబ్ లో చేరాడు. అదే సమయంలో ఈ ఘనత అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ లిస్ట్ లో రోహిత్ కంటే ముందు అఫ్రిది (351), క్రిస్ గేల్ (331) లతో మొదటి రెండు ఉండగా.. రోహిత్ శర్మ (303) మూడో స్థానంలో ఉన్నాడు.
ఇదే సమయంలో... ఈ మ్యాచ్ లో 86 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2019 ప్రపంచకప్ లో మాంచెస్టర్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 77 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రోహిత్ పేరున మరో సిక్స్ ల రికార్డ్ నెలకొంది. అవును... ఈ మ్యాచ్ లో ఆరు సిక్సర్లు కొట్టడం ద్వారా రోహిత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ లిస్ట్ లో రోహిత్ మూడుసార్లు ఈ ఘనత అందుకుని టాప్ ప్లేస్ లో ఉండగా... సచిన్ రెండుసార్లు ఈ ఫీట్ సాధించాడు.