ముంబై వర్సెస్ చెన్నై... ఆ డౌట్ క్లియర్ అవుతుందా?
ఐపీఎల్ సీజన్ లో రెండు హాట్ ఫేవరెట్స్.. ఇద్దరు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగుతుండగా.. ఈ మ్యాచ్ పై అత్యంత ఆసక్తి నెలకొందని అంటున్నారు.
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... 29 మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరగనుంది. ఈ సీజన్ లో ఆడిన ఇదు మ్యాచ్ లలోనూ 2 మాత్రమే గెలిచి 7వ స్థానంలో ముంబై ఉండగా.. ఆడిన 5 మ్యాచ్ లలోనూ మూడు మ్యాచ్ లలో గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.
ఐపీఎల్ సీజన్ లో రెండు హాట్ ఫేవరెట్స్.. ఇద్దరు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగుతుండగా.. ఈ మ్యాచ్ పై అత్యంత ఆసక్తి నెలకొందని అంటున్నారు.
ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ లో ఐదేసి మ్యాచ్ లు ఆడిన ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ లు వరుసగా 161, 156, 143 పరుగులతో టాప్ స్కోరర్స్ గా ఉన్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే... ముంబై తరుపున బూమ్రా అల్లల్లాడించేస్తున్నాడు. ఐదు మ్యాచ్ లు ఆడి 10 వికెట్లు తీసుకున్నాడు. ఇదే సమయంలో కొయిట్జీ 8 వికెట్లు పడగొట్టాడు.
ఇక చెన్నై బ్యాటర్స్ విషయానికొస్తే... శివం దుబే 5 మ్యాచ్ లు ఆడి 176 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్ 155, అజింక్యా రహానే 119 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే... ముస్తాఫిజూర్ రహమాన్ 4 మ్యాచ్ లలో 9 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్ పాండే 5 మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు తీసుకున్నాడు.
హెడ్ టు హెడ్ రికార్డ్స్!:
భీకర ప్రత్యర్థులుగా పేరొందిన ముంబై - చెన్నై జట్లు ఇప్పటి వరకు 36 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. వీటిలో 20 మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ గెలుపొందగా.. చెన్నై 16 మ్యాచ్ లలో గెలిచింది. ఇక, ఇప్పటివరకు చెన్నైపై ముంబై అత్యధిక స్కోరు 219గా ఉండగా.. ముంబై పై చెన్నై హైయెస్ట్ స్కోరు 218.
ఇక ప్రత్యేకంగా ఈ వాంఖడే స్టేడియం విషయానికొస్తే.. ఇక్కడ ఈ ఇరుజట్లూ 11 సార్లు తలపడగా... చెన్నై 4 మ్యాచ్ లలోనూ, ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ లలోనూ గెలిచింది.
వాంఖడే పిచ్ రిపోర్ట్:
చిన్న బౌండరీలు ఉండటంతో పాటు.. బ్యాటింగ్ కు సంపూర్ణంగా సహకరించేట్లు ఉండే ఈ వాంఖడే అధిక స్కోర్ లను అందిస్తుందనడంలో సందేహం లేదు. దీంతో.. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ముంబై తమ చివరి మ్యాచ్ లోనూ సరిగ్గా అదే చేసింది.
ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ (40 బంతుల్లో 61), దినేష్ కార్తీక్ (23 బంతుల్లో 53), రజత్ పటీదార్ (26 బంతుల్లో 50) అద్భుతంగా ఆడగా... ఛేజింగ్ లో భాగంగా ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38) దడదడ లాడించేశారు.
ఇక ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్ లు 45.54% ఉండగా.. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించిన మ్యాచ్ లు 54.46శాతంగా ఉన్నాయి. దీంతో... ఇక్కడ టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది!
ఆ డౌట్ క్లియర్ అవుతుందా?:
ఈ ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ పాండ్యా వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మపై కెప్టెన్ గా వేటుకు పాండ్యానే కారణమంటూ ముంబై అభిమానులు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. పైగా... వరల్డ్ క్లాస్ పేసర్ బుమ్రాను కాదని, తొలి మ్యాచ్ లో తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం కూడా విమర్శలకు కారణమైంది.
అయితే అనూహ్యంగా తర్వాత మ్యాచ్ లలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ పై దృష్టి సారించలేదు. దీంతో.. అందుకు వేరే కారణం ఉందంటూ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హార్దిక్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం... అతడు గాయపడ్డాడు కానీ బయటకు చెప్పకుండా దాస్తున్నాడంటూ సందేహం వ్యక్తం చేశాడు.
దీంతో.. సైమన్ డౌల్ లేవనెత్తిన ఈ సందేహం ఈ మ్యాచ్ లో నివృత్తి అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.