ఐపీఎల్ లక్నో ఫ్రాంచైజీలో ఏం జరుగుతోంది? ఎందుకీ రగడ..?

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానుల్లో వ్యాపారులు ఉన్నారు.. డేటా (మ్యాచ్ లలో కనబర్చిన ప్రతిభ) ఆధారంగా ఉత్తమ క్రీడాకారులను ఎంచుకుంటాం

Update: 2024-08-27 12:30 GMT

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానుల్లో వ్యాపారులు ఉన్నారు.. డేటా (మ్యాచ్ లలో కనబర్చిన ప్రతిభ) ఆధారంగా ఉత్తమ క్రీడాకారులను ఎంచుకుంటాం.. దీనికోసం వారు ఎంతో ఆలోచించి ఉండవచ్చు. అంతమాత్రాన ప్రతి మ్యాచ్‌ లోనూ గెలుస్తామని ఎవరమూ చెప్పలేం. ప్రతి ఆటగాడికి ఎప్పుడో ఒకప్పుడు క్లిష్ట కాలం ఉంటుంది’’ ఇదీ ఇటీవల టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ వ్యక్తం చేసిన అభిప్రాయం. దీన్నిబట్టి అతడు చెప్పేదేమంటే.. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యాన్ని నేరుగా తప్పుబడుతున్నాడు.

ఆ ఓటమితో మైదానంలోనే రగడ

గత ఐపీఎల్ సీజన్ లో లక్నో మంచి ప్రదర్శనే కనబర్చింది. ఆ జట్టు తరఫున ఆడిన మయాంక్ యాదవ్ ఏకంగా 156 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి ఔరా అనిపించాడు. కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, క్రునాల్ పాండ్య తదితరులతో కూడిన లక్నో సూపర్ జెయింట్స్ ఆకట్టుకుంది. అయితే, కీలక మ్యాచ్ లలో తడబడింది. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తో మ్యాచ్‌ లో ఓటమి అనంతరం రాహుల్‌ తో లక్నో ఫ్రాంచైజీ యజమాని

గోయెంకా మైదానంలో సీరియస్ గా మాట్లాడుతూ కనిపించాడు. ఆ తర్వాత లక్నో ఆట కూడా గాడి తప్పింది. రాహుల్‌ వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు అప్పట్నుంచే మొదలయ్యాయి. మెగా వేలం డిసెంబరులో జరగనున్న నేపథ్యంలో ఇవి మరింత పెరిగాయి. అయితే, రాహుల్ తాజాగా గోయంకాను కలిశాడు. తనను రిటైన్‌ చేసుకోవాలని అడిగాడని చెబుతున్నారు. దీనిపై అతడికి హామీ దక్కలేదని సమాచారం. బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే తమ ప్రణాళికలను బయటపెట్టాలని లక్నో భావిస్తోంది. అప్పుడే ఎంత ఖర్చు పెట్టగలమో తెలుస్తుంది. అందుకే ఎవరికీ మాట ఇవ్వడం లేదని తెలుస్తోంది.

అట్టిపెట్టుకోదు.. కెప్టెన్సీ ఇవ్వదు

లక్నోకు రాహుల్ కెప్టెన్. కానీ, అతడిని కొనసాగించే ఉద్దేశం వారికి లేదు. ఒకవేళ రిటైన్‌ చేసుకున్నా కెప్టెన్‌ గా కొనసాగించే అవకాశం మాత్రం లేదని చెబుతున్నారు. బ్యాటర్‌ గానే కొనసాగించాలనేది ఆలోచన. దీంతో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య, వెస్టిండీస్ విధ్వంసక వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ కెప్టెన్సీ చేపట్టే చాన్సుంది.

బెంగళూరు వదలి.. రాహుల్ కు అవసరమా?

కేఎల్ రాహుల్ కర్ణాటకకు చెందినవాడు. మంచి బ్యాట్స్ మన్. కానీ, అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ విన్నర్ గా ఎదగలేదు. మరోవైపు రాహుల్ టి20ల్లో జాతీయ జట్టుకు ఎంపికవడం కష్టమే. వన్డేల్లోనూ కాస్త డౌటే. అయితే, ఐపీఎల్ లో రాణించగలడు. కానీ, సొంత రాష్ట్రానికి చెందిన బెంగళూరు ఫ్రాంచైజీని వదిలేసి ఎక్కడో ఉన్న లక్నో కోసం పాకులాడడం ఎందుకో? రాహుల్ బెంగళూరుకు మారతాడనే కథనాలు వచ్చాయి. అదే నిజమైతే.. బ్యాటింగ్ బలహీనంగా ఉన్న బెంగళూరుకు బోనసే. ఏమో..? కెప్టెన్ కూడా కావొచ్చు.

Tags:    

Similar News