రింకూ.. జితేశ్.. రుతు.. దూబె.. కొత్తకొత్తగా టీమిండియా

ఒక్క ఏడాది వెనక్కెళ్లండి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేని టీమిండియా టి20 జట్టును ఊహించగలమా..?

Update: 2023-08-18 08:49 GMT

ఒక్క ఏడాది వెనక్కెళ్లండి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేని టీమిండియా టి20 జట్టును ఊహించగలమా..? ఆర్నెల్ల కిందటి వరకు బుమ్రా గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వస్తాడని కెప్టెన్ కూడా అవుతాడని భావించామా? కనీసం ఓ నెల కిందటైనా ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లకు ఇప్పుడప్పుడే టీమిండియాలో చోటుదొరుకుతుందని అనుకున్నామా? కానీ, ఇప్పుడు టీమిండియా కొత్తకొత్తగా కనిపిస్తోంది. కుర్రాళ్లతో కళకళలాడుతోంది. ఒకరా ఇద్దరా.. ఐదారుగురు దేశవాళీలో దుమ్మరేపి.. ఐపీఎల్ లో సత్తాచాటి జాతీయ జట్టులోకి వచ్చారు.

ఐపీఎల్ ఎందరికో దారి

టీమిండియాలోకి ఎంపికయ్యేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) దగ్గరి దారి. ఇప్పుడు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన రింకూ సింగ్‌ , జితేశ్ శర్మ, తిలక్ వర్మ, శివం దూబె తదితరులను చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. రింకూ అయితే జీవితంలో తొలిసారి బిజినెస్ క్లాస్‌ లో ప్రయాణించాడు. ఇతడితో పాటు విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే అరంగేట్రం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌ లోనూ మళ్లీ ఒకేసారి అరంగేట్రం చేస్తున్నారు.

దాదాపుగా మారిన జట్టు

ఓపెనర్లు రుతురాజ్, యశస్వి.. వన్ డౌన్ తిలక్, నంబర్ 4లో సంజూ, తర్వాత రింకూ, దూబె.. ఇదీ ఐర్లాండ్ తో శుక్రవారం తొలి టి20లో తలపడే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్. కెప్టెన్ బుమ్రాలాగానే గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్నాడు మరో పేసర్ ప్రసిద్ క్రిష్ణ. బుమ్రాకు కెప్టెన్సీ కొత్త. కాగా, ఐర్లాండ్‌ తో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. 2022 జూన్‌ లోనూ రెండు టి20లు ఆడిండి టీమిండియా.

బుమ్రాకు ఫిట్ నెస్.. సంజూకు ఫామ్

వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ ఆపై వచ్చే నెలలో జరిగే ప్రపంచ కప్ ముంగిట ఫిట్‌ నెస్‌ నిరూపించుకోవడం బుమ్రాకు, ఫామ్‌ చాటుకునేందుకు సంజూ శాంసన్‌ కు ఇదే మంచి అవకాశం. అయితే, వీటి మధ్యలో ఆసియా క్రీడలున్నాయి. వాటిలో సత్తా చాటేందుకు కుర్రాళ్లకూ ఐర్లాండ్ సిరీస్ చక్కటి చాన్స్. వెస్టిండీస్ తో వన్డేలు, టి20ల్లో నిరాశపరిచిన సంజూకు ఈ సిరీస్ చివరి చాన్స్. కాబట్టి.. జితేశ్ శర్మ ఎదురుచూడక తప్పదు. ఐపీఎల్ లో కోల్‌కతా తరపున గుజరాత్‌ పై చివరి ఓవర్లో వరుసగా అయిదు సిక్సర్లతో జట్టును గెలిపించిన రింకూకు మంచి అవకాశం దక్కింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్.. వెస్టిండీస్ సిరీస్ లో రాణించాడు. మళ్లీ సత్తాచాటితే.. ప్రపంచ కప్ రేసులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆ ఇద్దరు ఆల్ రౌండర్లు..

అచ్చం రింకూ లాగానే ఐదారేళ్ల కిందటే ఐదు సిక్సులు కొట్టి వెలుగులోకి వచ్చాడు శివం దూబె. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన ఇతడు టీమిండియాకు గతంలోనూ ఆడినా పెద్దగా రాణించలేదు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతూ అదరగొట్టిన అతడికి మళ్లీ ఇప్పుడు అవకాశం దక్కింది. తమిళనాడు కుర్రాడు, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్ గాయాల కారణంగా వెనుకబడ్డాడు. అతడికి ప్రస్తుతం దక్కిన చాన్స్ భవిష్యత్ కు ఉపయోగపడనుంది.

Tags:    

Similar News