అమెరికా నుంచి ఇంటికి కాదు.. ఇంగ్లండ్ కు.. పాక్ క్రికెటర్ల దీనావస్థ..

గతంలో భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ క్రికెటర్లు ఇంటికి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడేవారు

Update: 2024-06-18 11:54 GMT

గతంలో భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ క్రికెటర్లు ఇంటికి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడేవారు. ఏ తెల్లవారుజామునో విమానాశ్రయంలో దిగి ఎవరి కంటా పడకుండా వెళ్లిపోయేవారు. అయితే, ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి మారింది. కానీ, తాజా ప్రపంచకప్ లో ఘోర ఓటమితో పాక్ క్రికెటర్లకు మొహం చెల్లడం లేదు. ఇప్పటికే మేటి బ్యాటర్ బాబర్ ఆజామ్ కెప్టెన్సీని వదిలేశాడు.

పసికూన అమెరికా చేతిలో ఓడి.. పెద్దన్న భారత్ చేతిలోనూ పరాజయం పాలైన పాక్ క్రికెటర్లు స్వదేశం వెళ్తే అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలుసు. దీంతో ఆందోళన చెందిన కొందరు క్రికెటర్లు ఇంగ్లండ్ లో తలదాచుకున్నట్లు సమాచారం.

కాగా, టీ20 వరల్డ్ కప్‌ లో పాకిస్థాన్‌ లీగ్‌ దశ నుంచే ఇంటిముఖం పట్టింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం వారి ఆశలను గల్లంతు చేసింది. చివరగా ఐర్లాండ్‌ ను ఓడించడమే కాస్త ఊరట. దీంతో కెప్టెన్ బాబర్ అజామ్‌, మరో ఐదుగురు క్రికెటర్లు స్వదేశానికి వెళ్లలేదని తెలుస్తోంది. వీరంతా అమెరికాన చి ఇంగ్లండ్ వెళ్లినట్లు సమాచారం. కొన్ని రోజులు ఆగి.. వాతావరణం చల్లబడ్డాక పాక్‌ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

పేసర్ మహమ్మద్ ఆమిర్, స్పిన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీమ్, పేసర్ హారిస్ రవూఫ్‌, ఆల్ రౌండర్ షాదాబ్‌ ఖాన్, వికెట్ కీపర్ ఆజం ఖాన్ లండన్‌ లో ఆగినట్లు సమాచారం. గమనార్హం ఏమంటే.. వీరిలో కొందరు ఇంగ్లండ్ కౌంటీలు, లీగ్ లలో ఆడేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News