నాడు రాళ్లు వేస్తే మీలా ఏడుస్తూ కూర్చోలేదే.. పాక్ బోర్డుకు పఠాన్ భారీ పంచ్

టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శన చేసిన పాక్ ఆటగాళ్లను వదిలేసి.. అహ్మదాబాద్ స్టేడియంలో ప్రేక్షకులు సరిగా వ్యవహరించలేదని.. పాకిస్థాన్ పాఠలు ప్లే చేయలేదని.. అందుకే తమ జట్టు ఓడినట్లుగా చేస్తున్న వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.

Update: 2023-10-21 04:40 GMT

వన్డే ప్రపంచకప్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో దాయాది పాక్ దారుణమైన ఓటమిపాలు కావటం తెలిసిందే. ఓటమిని హుందాగా స్వీకరించాల్సింది పోయి.. కుంటిసాకులు చెబుతూ.. అతకని మాటలతో నోరు పారేసుకుంటున్న పాక్ క్రికెట్ బోర్డుకు దిమ్మ తిరిగే షాకిచ్చాడు మాజీ టీమిండియా సభ్యుడు పఠాన్. టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శన చేసిన పాక్ ఆటగాళ్లను వదిలేసి.. అహ్మదాబాద్ స్టేడియంలో ప్రేక్షకులు సరిగా వ్యవహరించలేదని.. పాకిస్థాన్ పాఠలు ప్లే చేయలేదని.. అందుకే తమ జట్టు ఓడినట్లుగా చేస్తున్న వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఇలాంటి వేళ.. మాజీ పేసర్ ఇర్పాన్ పఠాన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. పాక్ క్రికెట్ బోర్డు తీరును ఏకేసిన ఆయన.. గతంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. అందుకు సాక్ష్యంగా ఫోటోల్ని పోస్టు చేశారు. 2003-04లో టీమిండియాతో కలిసి పాక్ టూర్ కు తాను వెళ్లిన విషయాన్ని చెబుతూ.. పాక్ అభిమానుల నుంచి ఘన స్వాగతం తనకు లభించిందన్నారు. అయితే.. పర్యటనలో ఘన స్వాగతాలతో పాటు.. చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయన్న ఆయన.. అందుకు తగ్గట్లే.. ఒక మ్యాచ్ లో తనపై ఇనుప బోల్టులు.. రాళ్లు విసిరారని.. ఒకసారి తన కంటి వద్ద గాయమైన సందర్భంగా.. అంపైర్ కు తాను ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన అప్పటి ఫోటోను.. న్యూస్ క్లిప్ ను పోస్టు చేశారు. ‘‘ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ చాలామంది అభిమానులు ఉన్నాయి. అయినా అలా జరిగింది. అయితే.. మేమేమీ ఏడుస్తూ కూర్చోలేదు. తర్వాతి మ్యాచ్ లలో ఎలా గెలవాలన్న దానిపైనే ఫోకస్ పెట్టాం’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. టీమిండియా మ్యాచ్ లో ఓడిన నేపథ్యంలో పాక్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయటం తెలిసిందే. మ్యాచ్ ను ఐసీసీ ఈవెంట్ గా కంటే కూడా బీసీసీఐ ఈవెంట్ గా నిర్వహించారన్న ఆరోపణను ఐసీసీ కొట్టేసింది. ఓవైపు పఠాన్ లాంటి వారు.. మరోవైపు ఐసీసీ ఇస్తున్న షాకులకు పాక్ బోర్డు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓటమిని ఒప్పుకోవాల్సిన వేళ.. తొండి వాదనలకు దిగితే పరిస్థితులు ఇలానే ఉంటాయి మరి.

Tags:    

Similar News