టీమిండియాకు పాక్ కెప్టెన్ వెల్ కమ్... వస్తే మామూలుగా ఉండదంట!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా.. పాకిస్థాన్ కు వెళుతుందా లేదా అనేది ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే!

Update: 2024-10-31 10:30 GMT

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా.. పాకిస్థాన్ కు వెళుతుందా లేదా అనేది ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే! టీమిండియా లేని ఐసీసీ టోర్నీ జరుగుతుందా.. దాన్ని ఊహించుకోగలమా అనేది మరో ప్రశ్న. ఫిబ్రవరి 19-మార్చి 9 వరకూ జరిగే ఈ టోర్నీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి లను వేదికలుగా ఎంపిక చేశారు.

అయితే... ఈసారి పాకిస్థాన్ వేదికగా జరిగే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తాము పాకిస్థాన్ లో ఆడేది లేదని ఇప్పటికే పలుమార్లు భారత్ తేల్చి చెప్పిన పరిస్థితి. దీంతో... తటస్థ వేదికలను ఏర్పాటుచేసి హైబ్రిడ్ ఫార్మాట్ లో ఈ టోర్నీని నిర్వహించాలనే సూచనలూ తెరపైకి వచ్చాయి.

మరోవైపు పాక్ లో స్టేడియంల నిర్వహణపైనా పలువురు పెదవి విరుస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఈసారి ఛాంపియన్ ట్రోఫీ పాకిస్థాన్ లోనే జరుగుతుందని పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చెబుతున్నారు. ఈ సమయంలో టీమిండియాకు పాకిస్థాన్ నుంచి ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా పాక్ కొత్త కెప్టెన్ ఈ మేరకు వెల్ కం చెబుతున్నారు.

అవును... ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ కు టీమిండియా రావాలని కోరాడు ఆ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్నద్ రిజ్వాన్. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... పాకిస్థాన్ అభిమానులు టీమిండియా ఆటగాళ్లపై ప్రేమ చూపిస్తారని అన్నారు.

ఇదే సమయంలో... టీమిండియా ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు వస్తారా.. రారా.. అనే విషయం తనకు తెలియదు కానీ... ఒక వేళ వస్తే మాత్రం వారికి అద్భుతమైన స్వాగతం లభిస్తుందని.. వారు పాకిస్థాన్ కు భారత్ వచ్చి ఆడాలని తాము కోరుకుంటున్నామని తెలిపాడు. అందుకోసమైనా పాకిస్థాన్ కు టీమిండియా రావాలని అన్నాడు.

కాగా... భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీమిండియా జట్టును దాయాదీ దేశానికి 2008 నుంచి బీసీసీఐ పంపించడం లేదనే సంగతి తెలిసిందే. దీంతో.. పాకిస్థాన్ వెలుపల జరిగే ఐసీసీ ట్రోఫీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి.

Tags:    

Similar News