టీమ్ ఇండియాపై బిగ్ అప్ డేట్.. స్టార్ బ్యాటర్ రిటైర్మెంట్?
ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికిన టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇప్పుడు మొత్తం కెరీర్ కే వీడ్కోలు చెప్పేస్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి.
భారత క్రికెట్ లో ఓ శకం ముగియనుందా..? వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు.. టి20ల్లో ఐదు సెంచరీలు.. చెక్కుచెదరని రికార్డులు నెలకొల్పిన బ్యాట్స్ మన్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా..? టి20ల్లో భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్ ఇక తప్పుకోనున్నాడా? మరొక్క టోర్నమెంట్ లో మాత్రమే అతడిని టీమ్ ఇండియా జెర్సీలో చూడగలమా..? పరిస్థితుల ప్రకారం ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది.
ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికిన టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇప్పుడు మొత్తం కెరీర్ కే వీడ్కోలు చెప్పేస్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి. జట్టుపరంగా, ఫామ్ పరంగా టెస్టుల్లో దారుణ వైఫల్యాలతో రోహిత్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు రిటైర్ కావడం మేలన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు బీసీసీఐ ఆదేశాలతో రోహిత్ రంజీట్రోఫీ బరిలో దిగినా అక్కడా విఫలమయ్యాడు.
టీమ్ ఇండియా ఈ నెల 19 నుంచి మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది. ఇది వన్డే ఫార్మాట్ లో జరగనుంది. రోహిత్ నే కెప్టెన్ గా నియమించినందున ఇదే అతడి చివరి టోర్నీ అని చెబుతున్నారు.
కెరీర్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల బీసీసీఐ పెద్దలు రోహిత్ ను కోరారట. 2024ay టి20 ప్రపంచ కప్ గెలిచాక రోహిత్ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకొన్నాడు. నెల రోజుల కిందట ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగానూ రిటైర్ కానున్నాడనే కథనాలు వచ్చాయి. కానీ, అదేమీ జరగలేదు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీడ్కోలు నిర్ణయం తీసుకుంటాడని సమాచారం.
రోహిత్ సారథ్యంలో గత ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరిన టీమ్ ఇండియా ఈసారి విఫలమైన సంగతి తెలిసిందే. వచ్చే చాంపియన్ షిప్ (2025-27) సీజన్, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు సమాయత్తం అవుతోంది. అందుకే రోహిత్ భవితవ్యంపై స్పష్టత కోరే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా.. న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లతో కూడిన గ్రూప్ లో ఉంది. వీటిలో ఏ రెండు మ్యాచ్ లు గెలిచినా సెమీస్ చేరుతుంది. విఫలమైతే రోహిత్ కచ్చితంగా తప్పుకోవాల్సి ఉంటుంది.