525 గజాలు.. రూ.3 కోట్లు.. టీమిండియా స్టార్ ఖరీదైన చిన్న ఫ్లాట్

ఓ దశలో టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.

Update: 2024-09-25 11:30 GMT

సరిగ్గా ఏడాది కిందట అతడు టీమ్ ఇండియా ప్రధాన బ్యాట్స్ మెన్ లలో ఒకడు.. వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరిన జట్టులోనూ సభ్యుడు.. కానీ, ఆ తర్వాతే అతడి ఫేట్ మారిపోయింది... ఫిట్ నెస్ కూడా తప్పింది.. రంజీ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ నేరుగా సూచించినా దాన్ని లెక్కచేయనంతగా దిమాక్ తలకెక్కింది.. గాయం కారణంగా చూపినా.. అదేమంత నిజం ఇబ్బందికరం కాదని తేలింది. ఫలితంగా జట్టులో చోటే పోయింది. ఎలాగోలా మళ్లీ జట్టులోకి వచ్చినా నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు.

జట్టులో చోటుందా?

ఓ దశలో టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఇంకా చెప్పాలంటే భవిష్యత్ కెప్టెన్ కూడా అతడేనని అంచనా వేశారు. కానీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత అయ్యర్ రాత మారిపోయింది. రంజీలు ఆడాలని బీసీసీఐ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో జట్టుకు దూరమయ్యాడు. సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. టి20 ప్రపంచ కప్ జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్లను పిలిచి మరీ తీసుకున్నా.. అయ్యర్ ను పట్టించుకోలేదు. అయితే, అనుకోని వరంగా ఐపీఎల్ లో రాణించడంతో అయ్యర్ మళ్లీ లైన్ లోకి వచ్చాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలిపిన అతడిని టీమ్ ఇండియాలోకి తీసుకున్నారు. కానీ, అది టి20ల్లోకి మాత్రం కాదు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో ఆడించినా 23, 7, 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్ లో రెండు హాఫ్ సెంచరీలు చేసినా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. మొత్తమ్మీద 154 పరుగులే కొట్టాడు. ఇప్పటికే టి20లకు దూరమైన అతడిని టెస్టుల్లోకీ తీసుకోవడం లేదు. దీనికి నిదర్శనమే బంగ్లాదేశ్ తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్.

విధి అంటే ఇదే.. తిరిగి రంజీల్లోకి

నిరుడు రంజీలు ఆడనని మొరాయించిన అయ్యర్.. ఇప్పుడు విధి లేని స్థితిలో రంజీల్లో పాల్గొంటున్నాడు. మొన్న దులీప్ ట్రోఫీ ఆడిన అతడు, త్వరలో జరిగే ఇరానీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా, అయ్యర్ ముంబైలో కొన్న కొత్త ఇంటి గురించి చర్చ మొదలైంది. తల్లి రోహిణితో కలిసి ఉండేందుకు అతడు రూ.2.9 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నాడట. అది కేవలం 525 చదరపు గజాల ఇల్లు మాత్రమే కావడం గమనార్హం. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరిన జట్టు సభ్యుడైన, ఈ ఏడాది ఐపీఎల్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్న అయ్యర్ ఇంత చిన్న ఇంటికి అంత ఖర్చు పెట్టడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఈ నెల 19న ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందట.

ఉన్నత స్థాయి వ్యక్తులు నివసించే వర్లీ ఆదర్శ నగర్ పరిసరాల్లో ఉన్న ఈ చిన్న ఫ్లాట్ కు దాదాపు 3 కోట్లు పెట్టడం ఏమిటంటూ ఆశ్చర్యపోతున్నారా..? దీనిని అయ్యర్ కేవలం పెట్టుబడిగానే చూస్తున్నాడట. ఫ్లాట్ ఉన్న ప్రదేశం, ఆధునిక సౌకర్యాలు దీనికి కారణంగా చెబుతున్నారు. మొత్తానికి కాస్త తిక్కగా ప్రవర్తించి టీమ్ ఇండియాకు దూరమైన అయ్యర్.. ఆర్థికంగా మంచి ఆలోచనలే చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News