గతం గతః అంటున్న కేకేఆర్ కెప్టెన్... తెరపైకి ఆసక్తికర వ్యాఖ్యలు!
కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్ లో ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను అయ్యర్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమయంలో గాయం కాకుండానే ఆటకు దూరంగా ఉండిపోయాడనే ప్రచారం కూడా నడిచింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్.సీ.ఏ) వైద్యులు ఫిట్ గానే ఉన్నాడని చెప్పినా కూడా... గాయాన్ని సాకుగా చూపి రంజీ బరిలో దిగలేదనే కారణంతో వేటు పడింది!
అయితే... తర్వాత ముంబై జట్టు తరుపున రీ ఎంట్రీ ఇచ్చిన అయ్యర్... రంజీ ట్రోఫీలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో కీలకమైన 95 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ లో కోల్ కతా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో... ఈడెన్ గార్డెన్ లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో కేకేఆర్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో విలేఖరుల సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించాడు.
ఇందులో భాగంగా... ఆరోజు ఎన్.సీ.ఏ. వైద్యుడు ఏమి చెప్పాడన్న విషయం గురించి తాను ఏమాత్రం పట్టించుకోవట్లేదని, తానుమాత్రం వెన్నునొప్పితో బాధపడిన మాట మాత్రం వాస్తవమని తెలిపాడు. ఇక నాడు ఏమి జరిగిందనే దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే పనులు కావని చెబుతూ... ఆ చెత్తనంతా పక్కనపెట్టి, అత్యుత్తమ నైపుణ్యం ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాలని.. ప్రసెంట్ ఆ విషయంపై తన ఫోకస్ అంతా ఉందని అయ్యర్ తెలిపాడు.
ఇక తాజా ఐపీఎల్ కోసం సరిగానే సన్నద్ధమైనట్లు చెప్పిన అయ్యర్... రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తు, భారీ షాట్లు ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. గంటల పాటు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో... గతంలో తమ ప్రదర్శన అంత అద్భుతంగా లేదని, అలా అని అది తలచుకుని ఉండలేమని, ఈ సారి మాత్రం జట్టును విజేతగా నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపాడు.
ఇదే క్రమంలో గౌతం గంభీర్, మెయిన్ కోచ్ చంద్రకాంత్ పండిత్ గురించి స్పందించిన శ్రేయస్ అయ్యర్... కోల్ కతాను రెండు సార్లు ఛాంపియన్ గా నిలిపిన గౌతం గంభీర్ తో కలిసి పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పిన అయ్యర్... గతంలో తామిద్దరం వేరే ఫ్రాంచైజీకి పనిచేసినట్లు గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా... గంభీర్ వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయని, దూకుడైన ఆటను తీసుకొచ్చేందుకు సరికొత్త ఆలోచనలతో ప్రయత్నిస్తుంటాడని తెలిపాడు.
ఇదే సమయంలో... కేకేఆర్ మెయిన్ కోచ్ చంద్రకాంత్ పండిత్ అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పిన అయ్యర్... గౌతం – చంద్రకాంత్ కాంబినేషన్ వల్ల ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు. ఇక టీంలోని ప్రతీ ఆటగాడూ ఫాంలో ఉన్నాడని.. కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తామని తెలిపాడు.