టి20 వరల్డ్ కప్ షురూ.. వేడుకల్లో ప్రముఖుల సందడి.. మొత్తం 20 జట్లు..

ఇదే రోజు రెండో మ్యాచ్‌ లో వెస్టిండీస్, పపువా న్యూ గినియా జట్టుతో ఆడనుంది.

Update: 2024-06-01 12:30 GMT

రెండేళ్లలోపే టి20 ప్రపంచ కప్ మొదలైంది.. అత్యంత ఆదరణ పొందిన పొట్టి ఫార్మాట్ లో ధనాధన్ సమరానికి ఈసారి అమెరికా-కరీబియన్ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండడం విశేషం. మొత్తమ్మీద ఇది 9వ టి20 ప్రపంచకప్. అయితే, భారత్ మాత్రం తొలి కప్ (2007) తర్వాత మళ్లీ గెలవలేదు. కాగా, భారత్ లో జూన్ 2 (ఆదివారం) నుంచి ప్రపంచ కప్ మొదలైనట్లు. కానీ, వారి కాలమానం ప్రకారం అమెరికాలో మాత్రం 1వ తేదీనే కప్ ప్రారంభమైంది. డాలస్ లో అమెరికా-కెనడా మధ్యన మొదటి మ్యాచ్ జరగనుంది. మన టైమ్ ప్రాకారం ఉదయం 6 గంటలకు మొదలవుతుంది.

ఇదే రోజు రెండో మ్యాచ్‌ లో వెస్టిండీస్, పపువా న్యూ గినియా జట్టుతో ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీ పడుతుండగా.. ఐదు చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. మరోవైపు టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించే వేడుక టెక్సాస్‌ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరగనుంది. ఆదివారం ఉదయం 8.30కు మొదలయ్యే వేడుకలను భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో కూడా చూడొచ్చు.

ఉర్రూతలూగేలా గానం..

ట్రినిడాడియన్ గాయకులు డేవిడ్ రడ్డర్, రవి బి, స్వరకర్త, గీత రచయిత ఇర్ఫాన్ అల్వెస్, గాయకుడు డీజీ అనా, అల్ట్రా సిమ్మో ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

మెయిన్ టీమ్స్ ఇవి..

దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్.

పసికూనలు ఇవి..

కెనడా, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, ఉగాండా, అమెరికా.

మొత్తం 9 స్టేడియాల్లో..

గ్రూప్ ఎలో భారత్, పాకిస్థాన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా, గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, గ్రూప్ సిలో వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్థాన్, ఉగాండా, పపువా న్యూ గినియా. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ లు అమెరికాలోని న్యూయార్క్, డాలస్, లాడర్‌హిల్ (ఫ్లోరిడా)లో జరుగుతాయి. ఇంకొన్ని గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ లు, సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్స్ కు కరీబియన్ దీవుల్లోని బ్రిడ్జ్‌ టౌన్, ప్రొవిడెన్స్, నార్త్ సౌండ్, గ్రాస్ ఐలెట్, కింగ్‌ స్టన్, తరోబా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫైనల్ బ్రిడ్జ్‌ టౌన్ (బార్బడోస్)లో జరుగుతుంది.

Tags:    

Similar News