ఒలింపిక్ షూటింగ్ కాంస్యంతో చరిత్రకెక్కిన ఎవరీ సరబ్ జ్యోత్?
మరోవైపు 12 ఏళ్ల కిందట హైదరాబాదీ నేపథ్యమున్న గగన్ నారంగ్ షూటింగ్ లో కాంస్యం గెలిచిన రోజునే సరబ్ జ్యోత్ కూడా కాంస్యం నెగ్గడం గమనార్హం.
పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ తో కలిసి ఒలింపిక్ కాంస్యం సాధించిన సరబ్ జ్యోత్ సింగ్ గురించి ప్రస్తుతం ఇప్పుడంతా సెర్చింగ్ నడుస్తోంది. ఎవరితడు..?? అంటూ ఆరాలు తీయడం మొదలైంది. వాస్తవానికి ఇతడిది చెప్పుకోదగ్గ విశేషమే.. రెజ్లింగ్ కు పేరుగాంచిన హరియాణా వంటి రాష్ట్రంలో షూటర్ రావడమే అరుదు.. అందులోనూ ఒలింపిక్ స్థాయికి ఎదిగాడు. మరోవైపు 12 ఏళ్ల కిందట హైదరాబాదీ నేపథ్యమున్న గగన్ నారంగ్ షూటింగ్ లో కాంస్యం గెలిచిన రోజునే సరబ్ జ్యోత్ కూడా కాంస్యం నెగ్గడం గమనార్హం. అయితే, ఇందులో అతడి పట్టుదల, ఏకాగ్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అటు మను.. ఇటు ఇతడు..
గత ఆదివారం మహిళల్లో మను బాకర్ షూటింగ్ లో పతకం సాధించింది. అదే రోజు సరబ్ జ్యోత్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగం తుది పోరులో బెర్త్ చేజార్చుకున్నాడు. అది కూడా అతి కొద్ది తేడాతో. అయినా అతడు పోరాటం ఆపలేదు. ఆ వెంటనే మనుబాకర్ తో కలిసి ఆడబోయే మిక్స్‌డ్ విభాగంపై ఫోకస్ పెంచాడు. మంగళవారం పతకం ఒడిసిపట్టాడు.వీరి జోడీ దక్షిణ కొరియా జట్టును 16-10 తేడాతో ఓడించి భారత్ కు రెండో పతకం తెచ్చింది. ప్రస్తుత ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన రెండు పతకాలు ఇవే.
మూడో షూటర్ ఇతడు..
హైదరాబాద్ నేపథ్యం ఉన్న నారంగ్, విజయ్ కుమార్ తర్వాత పతకం సాధించిన మూడో భారత షూటర్ సరబ్ జ్యోత్. ఇతడిది హరియాణలోని అంబాలా సమీపంలోని ధేన్ గ్రామం. జతీందర్ సింగ్-హర్దీప్ కౌర్ దంపతులకు సరబ్ జ్యోత్ సెప్టెంబరు 2001న జన్మించాడు. వీరిది రైతు కుటుంబం. అయితే, ఫుట్ బాలర్ కావాలనేది సరబ్ జ్యోత్ లక్ష్యం. 13 ఏళ్ల వయసులో సమ్మర్ క్యాంప్ లో పిల్లలు పేపర్ టార్గెట్లను గురిపెట్టడం చూసి పిస్తోల్ షూటింగ్ వైపు మొగ్గాడు. ఖరీదైన క్రీడ కావడంతో తల్లిదండ్రులు వెనుకంజ వేసినా.. సరబ్ జోత్ మాత్రం వెనక్కుతగ్గలేదు. వారికి నచ్చజెప్పాడు. జిల్లా స్థాయిలో రజతం సాధించడంతో మరింత ప్రోత్సహించారు. దిగ్గజ షూటర్ అభిషేక్ రాణా పర్యవేక్షణలో ప్రొఫెషనల్ కోచింగ్ మొదలైంది. చండీగఢ్ డీఏవీ కళాశాలలో చదివిన సరబ్ జ్యోత్.. అంబాలాలోని ఏఆర్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందాడు. 2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ విజేత. వ్యక్తిగత విభాగం, మిక్స్‌డ్ టీమ్ విభాగంల్లో రజతాలు సాధించాడు. ఆ వెంటనే దోహాలో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచాడు. 2022లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో రెండు స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. 2023 ఆసియా ఛాంపియన్ షిప్స్ లో కాంస్యం సరబ్ జీత్ జీవితంలో పెద్ద మలుపు. దాని ద్వారానే ఈ ఒలింపిక్స్ లో బెర్త్ దక్కింది. కాంస్యమూ దక్కింది.