పోటాపోటీ 'కొంగొత్' గూడెం.. పొంగులేటి-వద్దిరాజు ఢీ?
కొత్తగూడెంలో ఢీ అంటే ఢీ చిత్రంగా పొంగులేటి, వద్దిరాజు కొత్తగూడెంలో ఢీ కొట్టబోతున్నారు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరికతో ఉమ్మడి ఖమ్మం రాజకీయాలు రంజుగా మారాయి. ప్రజాబలం ఉన్న పొంగులేటి రాక కాంగ్రెస్ కు మరింత బలమైంది. అయితే, దీనికి విరుగుడుగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంలో ఉన్నవే మూడు జనరల్ నియోజకవర్గాలు. అవి ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు. వీటిలో పొంగులేటి ఎక్కడినుంచి పోటీ చేస్తారనేది సందిగ్ధం. ఆయన అసెంబ్లీకి వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
అంటే ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో ఒకదాంట్లో పోటీ చేయాలి. పాలేరులో వైఎస్ షర్మిల రంగంలో ఉంటే పొంగులేటి దూరమే. అందులోనూ పొంగులేటి వియ్యంకుడు కాంగ్రెస్ పాలేరు సీటును ఆశిస్తున్నారు. దీంతో పాలేరులో నో చాన్స్. ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అక్కడ రవాణా మంత్రి అజయ్ రూపంలో గట్టి పోటీ తప్పదు. అందులోనూ సమీకరణాలు కూడా అనుకూలంగా లేవు. దీంతో పొంగులేటి టార్గెట్ కొత్తగూడెం అని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం.
అక్కడైతే పోటీ లేదు..
కొత్తగూడెం సురక్షితం అని పొంగులేటి భావించడానికి కారణం రాజకీయ, సామాజిక సమీకరణాలే. రాజకీయంగా చూస్తే కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రస్తుతం వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన బీఆర్ఎస్ కు జైకొట్టారు. అయితే, ప్రస్తుతం ఆయనకు 80 ఏళ్లు పైబడ్డాయి. వనమా కుమారుడు రాఘవేంద్రపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కేసులూ నమోదయ్యాయి. రాజకీయంగా చూస్తే రాఘవేంద్రకు దారులు క్లిష్టంగా ఉన్నాయి. ఈ విషయంలో కొంత కుట్ర కనిపిస్తున్నా వెంకటేశ్వరరావు కానీ, రాఘవ కానీ గట్టిగా ప్రతిఘటించలేకపోయారు.
గడలకు టికెట్ కట్...?
కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్ ఎవరికి అన్న సందేహాల నడుమ అనూహ్యంగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరు బయటకు వచ్చింది. "జన హిత" అంటూ ఆయన ఏకంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు పెద్దఎత్తున చేస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అటు సీఎం కేసీఆర్ ఆశీస్సులు కూడా ఉండడంతో ఓ దశలో కొత్తగూడెం టికెట్ గడల శ్రీనివాసరావుకే అన్న ప్రచారం జరిగింది. అయితే, మారిన సమీకరణాల్లో గడలకు చాన్స్ లేనట్లు తెలుస్తోంది.
పొంగులేటిని ఢీకొట్టాలంటే వద్దిరాజే సరి ఉమ్మడి ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టే నాయకుడి కోసం బీఆర్ఎస్ వెదుకుతోంది. అది ఆర్థికంగానూ, నాయకత్వ పరంగానూ అయి ఉండాలని చూస్తోంది. ఆ క్రమంలోనే వారికి వద్దిరాజు రవిచంద్ర రూపంలో సరైన నాయకుడు దొరికాడు. అసలు.. ఏడాదిన్నర కిందట వద్దిరాజుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిందే ఇందుకోసమని ఇప్పుడు తెలుస్తోంది. పొంగులేటి అప్పటికే తిరుగుబావుటాలో ఉండడమే దీనికి కారణం. ఇపుడు వద్దిరాజును బీఆర్ఎస్ కొత్తగూడెం నుంచి పోటీ నిలపనున్నట్లు సమాచారం.
కొత్తగూడెంలో ఢీ అంటే ఢీ చిత్రంగా పొంగులేటి, వద్దిరాజు కొత్తగూడెంలో ఢీ కొట్టబోతున్నారు. కాంగ్రెస్ తరఫున శ్రీనివాసరెడ్డి అక్కడ బరిలో నిలిచే అవకాశం ఉండడంతో ఆయనను ఢీకొట్టేందుకు సరైన వ్యక్తి వద్దిరాజు అని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కొత్తగూడెంలో రసవత్తర సమరం ఖాయం. వాస్తవానికి కొత్తగూడెంలో మున్నూరు కాపుల ఓట్లు అధికం. వీరంతా ఇన్నాళ్లూ వనమా వెంట నడిచారు. డాక్టర్ గడల సైతం వీరినే నమ్ముకుని ఉన్నారు. వద్దిరాజు సైతం ఇదే సామాజిక వర్గం వారు. కాగా, పొంగులేటికి పార్టీలు, సామాజిక వర్గాలకు అతీతంగా బలం, బలగం ఉంది. ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేసినా తీవ్ర ప్రభావం ఉంటుంది. అటు ప్రత్యర్థి వద్దిరాజు అయితే ఇక పోటాపోటీ ఖాయం.