అమెరికాలో మళ్లీ.. ఈసారి తుపాకీ కాదు కత్తి!
కత్తితో దాడికి దిగిన నిందితుడిని క్యాంపస్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలో తుపాకీలతో ప్రజలను ఉన్మాదులు కాల్చివేసిన ఘటనలు ఇటీవల కాలంలో పలుమార్లు జరిగాయి. ఈసారి ఒక ఉన్మాది ఒక యూనివర్సిటీలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ఈ ఘటన అమెరికాలోని లూసియానా టెక్ యూనివర్శిటీలో జరిగింది. కత్తితో దాడికి దిగిన నిందితుడిని క్యాంపస్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతడు 23 ఏళ్ల విద్యార్థి జాకోబీ జాన్సన్ అని పోలీసులు చెబుతున్నారు. అతడు క్యాంపస్ లోనే పోలీసులకు పట్టుబడ్డాడు.
విచక్షణారహితంగా నలుగురిపై కత్తితో దాడి చేశాక నిందితుడు సంఘటన స్థలం నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అయితే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కత్తితో దాడి చేసిన సమయంలో నిందితుడు జాకోబీ జాన్సన్ కు కూడా గాయాలు అయ్యాయి. దీంతో అతడిని రుస్టన్ లోని నార్తర్న్ లూసియానా మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స అందించాక జాన్సన్ పై హత్యాయత్నానికి సంబంధించి నాలుగు అభియోగాలు మోపారు.
ఈ సంఘటన లూసియానా టెక్ యూనివర్సిటీ క్యాంపస్ లోని లాంబ్రైట్ స్పోర్ట్స్ అండ్ వెల్ నెస్ సెంటర్ ముందు అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 9 గంటల తర్వాత జరిగింది. ఇది యాధృచ్ఛిక హింస అని నమ్ముతున్నట్లు లూసియానా టెక్ ప్రతినిధి టామ్ సోటో తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
కాగా నిందితుడి దాడిలో గాయపడిన విద్యార్థి డొమినిక్ మెక్ కెయిన్ అని గుర్తించారు. అతను యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడని చెబుతున్నారు. అప్పుడే తరగతి ముగించుకున్న వస్తున్న మెక్ కెయిన్ నిందితుడు జాన్సన్ బారిన పడ్డాడు. కత్తిపోట్లకు గురయిన మెక్ కెయిన్ ను శ్రేవ్ పోర్ట్ లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అతడి పరిస్థితి స్థిరంగానే ఉందని సమాచారం. అలాగే మరో ఇద్దరు బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా గాయపడిన మరో వ్యక్తి చికిత్సకు నిరాకరించాడు.
కాగా ఈ ఘటనతో యూనివర్సిటీ క్యాంపస్ ఏమీ మూతపడదని వర్సిటీ అధికారులు తెలిపారు. బాధిత విద్యార్థులకు గ్రూప్ కౌన్సెలింగ్ సెషన్ లు అందుబాటులో ఉంచబడతాయని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులతోపాటు తాము కూడా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.