అంజలి సినిమాలో నిజమైన 'గేమ్ ఛేంజర్'
దిల్ రాజు బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమాగా ఈ సినిమాను చెబుతున్నారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. దిల్ రాజు ఈ సినిమాను దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. దిల్ రాజుకు ఈ సినిమా అత్యంత కీలకం అనే విషయం తెల్సిందే. దిల్ రాజు బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమాగా ఈ సినిమాను చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శంకర్ గత పాత సినిమాలను పోలి గేమ్ ఛేంజర్ ఉంటుంది అని, ఇండియన్ 2 సినిమాతో ఈ సినిమాకు అస్సలు పోలిక ఉండదు అంటూ దిల్ రాజుతో పాటు ఇతర యూనిట్ సభ్యులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. తండ్రి కొడుకుగా మొదటి సారి చరణ్ డ్యూయెల్ రోల్ చేసిన నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శంకర్ ఈ సినిమాను రూపొందించారు. చరణ్‌కి జోడీగా ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు. తండ్రి పాత్రలో కనిపించిన చరణ్‌కి జోడీగా తెలుగు అమ్మాయి అయిన అంజలి నటించగా కొడుకు పాత్రలో నటించిన చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు జంటలకు మంచి స్పందన వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.
అంజలి ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాల్లో అంజలి పాత్రకు చాలా వెయిట్ ఉంటుంది అంటున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే సినిమాలో ఆమె గేమ్ ఛేంజర్ అంటున్నారు. అంటే కథ మొత్తం ఆమె వల్ల టర్న్ అవుతుంది, సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది. కనుక అంజలి కనిపించిన కొద్ది సమయం అయినా చాలా స్ట్రాంగ్ పాత్రతో కనిపించబోతుంది అంటూ సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో అంజలి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తుంది. చాలా కాలం తర్వాత స్టార్ హీరోకు జోడీగా నటించింది.
కియారా అద్వానీ కాలేజ్ లో చరణ్ స్నేహితురాలిగా కనిపించబోతుంది. ఆమె పాటలకు పరిమితం అయినా అంజలి మాత్రం నటనకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు. కచ్చితంగా అంజలి పాత్ర సినిమాకు బలం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. జనవరి 1న సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయమై నేడు పవన్ కళ్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు కలువబోతున్నాడు. ఏపీలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.