స్వీటీ అనుష్కని వదలనంటున్న క్రేజీ మేకర్స్
దీంతో అనుష్కకు మంచి బ్లాక్ బస్టర్‌ని అందించాలనే యువీ క్రియేషన్స్ వారి ప్లాన్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
రెండేళ్ల విరామం తరువాత స్వీటీ అనుష్క నటించిన 'నిశ్శబ్దం' భారీ షాక్ ఇచ్చింది. మిస్టరీ థ్రిల్లర్‌గా హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. ఏ భాషలోనూ కనీసం యావరేట్ టాక్‌ని కూడా దక్కించుకోలేకపోయింది. స్వీటీ భారీ అంచనాలు పెట్టుకుని చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో మరో సినిమా కోసం దాదాపు మూడేళ్లు విరామం తీసుకుంది. ఫైనల్‌గా యువీ క్రియేషన్స్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
'జాతిరత్నాలు' సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచినయంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి అనుష్క నటించిన రొమాంటిక్ కామెడీ 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబర్ 7న భారీ పోటీ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే ఓ పక్క తలైవా 'జైలర్' హవా, మరో పక్క షారుక్ ఖాన్ 'జవాన్' దూకుడు ముందు 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తన ప్రభావాన్ని ఆశించిన స్థాయిలో చూపించలేకపోయింది.
దీంతో అనుష్కకు మంచి బ్లాక్ బస్టర్‌ని అందించాలనే యువీ క్రియేషన్స్ వారి ప్లాన్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లని నిర్మిస్తూ..మరి కొన్ని పాన్ ఇండియా సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న యువీ మరోసారి స్వీటీ కోసం రంగంలోకి దిగుతోంది. సూర్య హీరోగా జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న 'కంగువ' చిత్రానికి, వైఎస్ జగన్ బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న 'యాత్ర 2'కు యువీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
దీనితో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలు చేస్తోంది. వీటితో బిజీగా ఉన్నా అనుష్కతో మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతోందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త కథలని అన్వేషిస్తోంది. అంతే కాకుండా అనుష్క ప్రధాన పాత్రలో కథ ఉండేలా కొత్త దర్శకులని వెతుకుతోంది. 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి'ని కూడా అనుష్క ప్రధానంగానే నిర్మించిన యువీ మరో సారి అదే పంథాలో సాగే కథని అనుష్క కోసం అన్వేషిస్తుండంతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ స్క్రిప్ట్‌లు పట్టుకుని యువీ ఆఫీస్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారట.