విజయ్ దేవరకొండకు అరవింద్ సర్టిఫికెట్

Update: 2018-07-30 04:20 GMT
తనను తాను రౌడీగా పేర్కొంటూ.. తన అభిమానుల్ని కూడా రౌడీలని పిలుస్తాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలకు ముందు నుంచి అతడి యాటిట్యూడ్ మీద తెలుగు సినీ పరిశ్రమలోనే కాక మామూలు జనాల్లోనూ చాలా చర్చే నడుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జనాలతో బూతులు పలికిస్తూ అతను చేసిన ప్రసంగం కావచ్చు.. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును ఉద్దేశించి ‘చిల్ తాతయ్యా’ అనడం కావచ్చు.. ఆపై పలు సందర్భాల్లో అతడి వ్యాఖ్యలు కావచ్చు.. వివాదాస్పదమయ్యాయి. చర్చనీయాంశమూ అయ్యాయి. విజయ్ ఏరి కోరి ఒక బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకుంటున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ యాటిట్యూడ్ ఉన్న వాడు సినిమా షూటింగుల టైంలో ఎలా ఉంటాడో.. అతడిని డీల్ చేయడం ఎలానో అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

కానీ విజయ్ అందరూ అనుకునేటట్లు చెడ్డవాడు కాదని అంటున్నాడు అల్లు అరవింద్. విజయ్ తనను తాను రౌడీ అని పిలుచుకుంటాడే తప్ప నిజానికి అతను చాలా మంచి వాడని చెప్పాడు. నిజాయితీగా ఏదనుకుంటే అది మాట్లాడటం అతడి నైజమని అరవింద్ అన్నాడు. తన మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ గురించి వేదిక మీద మాట్లాడి.. తనపై తాను జోకులు వేసుకుని.. జనాల్ని ఎంటర్టైన్ చేయడం.. దాన్ని కూడా ప్రమోషన్లో భాగం చేయడం అన్నది విజయ్ తెలివితేటలకు నిదర్శనమని అరవింద్ చెప్పాడు. అతను గ్రేట్ పెర్ఫామర్ అని కూడా విజయ్ కితాబిచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన వారానికి ‘గీత గోవిందం’ మొదలైందని.. ‘అర్జున్ రెడ్డి’ సాధించిన విజయం చూసి తామంతా కొంచెం కంగారు పడ్డామని.. ఆ సినిమాతో విజయ్ ఇమేజ్ మారిపోయిన నేపథ్యంలో విజయ్ కి ‘గీత గోవిందం’ సూటవుతుందా అని సందేహించామని.. కానీ ఏ పాత్రనైనా పండించగల నైపుణ్యం ఉన్న హీరో తమకున్నాడన్న ధైర్యంతో ఏ మార్పులూ చేయకుండా ముందు ఎలా అనుకున్నామో అలాగే ఆ పాత్రను ఉంచి షూటింగ్ కొనసాగించామని అరవింద్ వెల్లడించాడు.
Tags:    

Similar News