ట్రంప్ పై అలిగి అవార్డ్ అందుకోలేదు

Update: 2017-02-27 10:36 GMT
ఆస్కార్ వంటి అత్యుత్త‌మ అవార్డు ద‌క్కితే ఎవ‌రైనా ఎంత సంతోషిస్తారు. కానీ అంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కించుకున్న ప్ర‌ముఖ చిత్ర డైరెక్ట‌ర్ అస్ఘ‌ర్ ఫ‌ర్హాదీ తాను అవార్డు తీసుకోన‌ని చెప్పాడు. దీనికి కార‌ణం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. వివ‌రాల్లోకి వెళితే అకాడ‌మీ అవార్డ్స్‌లో ఈసారి ఉత్త‌మ విదేశీ భాషా చిత్రంగా ఇరాన్ సినిమా ద సేల్స్‌మాన్ నిలిచింది. ట్రంప్ ఏడు ముస్లిం దేశాల వారు అమెరికాలో అడుగుపెట్ట‌కుండా నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే క‌దా. అందులో సేల్స్‌మాన్ సినిమా డైరెక్ట‌రైన‌ అస్ఘ‌ర్ స్వ‌దేశం ఇరాన్ కూడా ఒక‌టి. దీంతో ఆయ‌న ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి డుమ్మాకొట్టారు. ట్రంప్ తీరు న‌చ్చ‌కే తాను ఈ అవార్డుల సెర్మ‌నీకి రావ‌డం లేద‌ని ఓ సందేశాన్ని కూడా అస్ఘ‌ర్ పంపించ‌డం విశేషం. నిజానికి ఈ అవార్డు అందుకోవ‌డం కోసం అత‌నికి ప్ర‌త్యేకంగా వీసా కూడా జారీ చేసినా.. అత‌ను మాత్రం రాలేదు.

దీంతో అతని కోసం ఆస్కార్స్ తొలిసారి తమ నిబంధనలను కూడా మార్చింది. నిజానికి ఆస్కార్స్ నిబంధనల ప్రకారం ఒకరికి వచ్చిన అవార్డును మరొకరు అందుకోవడం కుదరదు. కానీ అస్ఘర్ ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకొని అతని తరఫున మరొకరు అందుకోవడానికి అనుమతినిచ్చింది. అస్ఘర్ తరఫున ఇరానియన్-అమెరికన్ ఆస్ట్రోనాట్ అనౌషేహ్ అన్సారీ ఈ అవార్డు అందుకుంది. అస్ఘర్ పంపిన సందేశాన్ని కూడా ఈ సందర్భంగా అన్సారీ చదివి వినిపించింది. "అతను తీసుకున్న నిర్ణయం కఠినమైనదే అయినా.. కొన్ని విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాలంటే ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌దు. "అని ఆమె చెప్పింది. అస్ఘ‌ర్ ఆస్కార్ అందుకోవ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2011లో ఎ సెప‌రేష‌న్ సినిమాకు కూడా అస్ఘ‌ర్ ఆస్కార్ అందుకున్నాడు. " రెండోసారి ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అందుకోవ‌డం గ‌ర్వంగా ఉంది. అకాడ‌మీ స‌భ్యుల‌తోపాటు, మా టీమ్ స‌భ్యులకు కృత‌జ్ఞ‌త‌లు.  స‌మ‌యంలో అక్క‌డ లేనందుకు న‌న్ను క్ష‌మించండి. నా దేశంతో పాటు ఇత‌ర ఆరు దేశాల ప్ర‌జ‌ల గౌర‌వార్థం నేను అక్క‌డికి రాలేదు. ప్ర‌పంచాన్ని అమెరికా, ఇత‌ర శ‌త్రుదేశాలుగా విడ‌గొట్టడం స‌రికాదు. ఇది యుద్ధ వాతావ‌ర‌ణానికి దారి తీస్తుంది" అని అస్ఘ‌ర్ త‌న సందేశంలో అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News