జ‌పాన్ లో బాహుబ‌లి క్రేజ్ RRR కి రాలేదా?

Update: 2022-10-26 02:30 GMT
ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి - బాహుబ‌లి 2 చిత్రాలు జ‌పాన్ లో బంప‌ర్ హిట్లు కొట్టాయి. క‌ట్ట‌ప్ప ఫార్ములా అక్క‌డ కూడా బాగానే వ‌ర్క‌వుటైంది. ప్ర‌భాస్ లోని రాజ‌సానికి జ‌ప‌నీలు మంత్ర‌ముగ్ధులైపోయారు. దీంతో ఈ ఫ్రాంఛైజీ అక్క‌డ (చిన్న దేశంలో) అసాధార‌ణ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. బాహుబ‌లి ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళికి.. ప్ర‌ధాన పాత్ర‌ధారులు ప్ర‌భాస్ - రానాల‌కు కూడా జ‌పాన్ లో చ‌క్క‌ని గుర్తింపు గౌరవం ద‌క్కాయి. రాజ‌మౌళి బ్రాండ్ కూడా అక్క‌డ మార్మోగింది.

ఇదే అద‌నుగా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీని జ‌పనీ భాష‌ల్లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ముందే ప్ర‌చారం కోసం రాజ‌మౌళి- రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ బృందం జ‌పాన్ లో వాలిపోయారు. అక్క‌డ మీడియాల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు. కానీ ఫ‌లితం ఆశించినంతగా ఉందా? అంటే రెండో రోజు నుంచి డ్రాప్స్ క‌నిపిస్తున్నాయ‌న్న‌ టాక్ వినిపించ‌డం కొంత నిరాశ‌ను క‌లిగిస్తోంది. ఈ సినిమా తొలి వీకెండ్ కేవ‌లం 4కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింద‌ని చెబుతున్నారు.

జపాన్ లో ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాకి హైప్ ఉన్నప్పటికీ తక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. SS రాజమౌళి యాక్షన్ బ్రోమాన్స్ భారతదేశంలో ..అంతర్జాతీయంగా భారీ విజయాన్ని సాధించింది. వాస్తవానికి రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ల‌కు ప్రపంచ సినీ ప్రేక్షకులచే ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వ‌ర‌ల్డ్ వైడ్ 1200 కోట్ల వసూళ్లను సాధించింది. ఇందులో అలియా భట్ -అజయ్ దేవగన్ అతిధి పాత్రలు సినిమాకి ప్ల‌స్. RRR ఆస్కార్ 2023కి భారతదేశం నుంచి అధికారికంగా నామినేట్ అవుతుంద‌ని కథనాలు వెలువ‌డ‌గా హైప్ మ‌రింత పెరిగింది. అయితే ఆస్కార్ విష‌యంలో ఆశించిన‌ది జరగలేదు కానీ RRR ఇటీవలే జపాన్ లో గొప్ప హైప్ తో విడుదలైంది. ఇది చాలా భారీ ప్ర‌ణాళిక‌తో విడుద‌లవ్వ‌డ‌మే గాక‌... RRR స్టార్ లు రామ్ చరణ్.., ఎన్టీఆర్ ..SS రాజమౌళి జపాన్ లో సినిమాను అసాధార‌ణంగా ప్రమోట్ చేసారు.

ఆర్‌.ఆర్‌.ఆర్ అక్టోబర్ 21న జపనీస్ థియేటర్ లలో విడుదలైంది. ఒక‌ట‌వ రోజున అద్భుతమైన స్పందన వ‌చ్చింది. కానీ ఆ త‌ర్వాత‌ ప్ర‌జ‌లు ఆశించినంత‌గా థియేట‌ర్ల వైపుకు రాలేద‌ని తెలిసింది. రెండో రోజు నుంచి జపాన్ బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్లు డ్రాప్ అయ్యాయ‌ని ట్రేడ్ చెబుతోంది. RRR మొదటి రోజు 1 కోటి గ్రాస్ వసూలు చేసింది. సాహో- బాహుబలి 2 -దంగల్ వంటి చిత్రాల రికార్డులను కూడా డే వ‌న్ లో అధిగమించింది. కానీ అనూహ్యంగా రెండో రోజు డ్రాప్స్ క‌నిపించాయి. ప్రస్తుత రెవెన్యూ ప‌రిశీలించాక‌.. ఇప్పటికీ ఇవి మంచి వ‌సూళ్లేన‌ని భావించినా జపాన్ లో ముందే సృష్టించిన హైప్ తో సరిపోలడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ చిత్రం వారాంతంలో (అంటే శని, ఆదివారాల్లో) స్థిరమైన వసూళ్లు సాధిస్తోంది. గత వారాంతంలో 3.7 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఈ ఎపిక్ పీరియడ్ డ్రామా 20వ శతాబ్దం ప్రారంభంలో సాగే క‌థ‌తో తెర‌కెక్కింది. బ్రిటిష్ ఇండియాలోని ఇద్దరు భార‌తీయ‌ విప్లవకారుల కథేమిట‌న్న‌దే సినిమా క‌థాంశం. భారీ యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

ప్ర‌స్తుతానికి ఎన్టీఆర్ - రామ్ చరణ్ జపాన్ లో ఓవైపు RRR ప్రమోషన్ లో ఉన్నా మ‌రోవైపు ఫ్యామిలీ ట్రిప్ ని కూడా సరదాగా గడుపుతున్నారు. స్టార్లు ఇద్ద‌రూ తమ జీవిత భాగస్వాములతో కలిసి టోక్యోకు వెళ్లారు. వారు ఈ వారంలో తిరిగి భారతదేశానికి వస్తారని తెలిసింది. తిరిగి రాగానే ఎన్టీఆర్ కొర‌టాల‌తో షూటింగులో బిజీ అయిపోతారు. నవంబర్ రెండో వారంలో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. కొరటాల శివ స్క్రిప్టును ఫైనల్ చేసార‌ని లీక్ అందింది. చ‌ర‌ణ్ కూడా త‌న త‌దుప‌రి ప్రాజెక్టును ఖ‌రారు చేయాల్సి ఉంది. శంక‌ర్ తో ఆర్.సి 15 షెడ్యూళ్లు పూర్తి చేస్తూనే త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అన్న‌ది ఖ‌రారు చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి చ‌ర‌ణ్ కోసం ఇద్ద‌రు ద‌ర్శ‌కులు వెయిటింగ్ లో ఉన్నార‌ని స‌మాచారం. ఇందులో జెర్సీ ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి పేరు కూడా వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News