'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ..!

Update: 2021-08-21 05:09 GMT
పవన్ కళ్యాణ్ -  రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయాలని భావిస్తున్నారని.. ఈ మేరకు దర్శక నిర్మాతలు 'భీమ్లా నాయక్' మేకర్స్ తో చర్చలు జరిపారని టాక్ వచ్చింది. అంతేకాదు 'భీమ్లా నాయక్' చిత్రాన్ని రిపబ్లిక్ డే వీక్ కు వాయిదా వేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా #PSPKRana చిత్ర నిర్మాతలు మరోసారి సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.

'బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లా నాయక్' అనే పేరుతో పవన్ కు సంబంధించిన ఓ స్మాల్ వీడియోని ఈరోజు శనివారం చిత్ర బృందం వదిలింది. ఈ సందర్భంగా 'భీమ్లా నాయక్' సినిమా 2022, జనవరి 12న రాబోతోందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా పవన్ - రానా ల సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

ఇక 'భీమ్లా నాయక్' బ్రేక్ టైమ్ వీడియో విషయానికొస్తే.. ఇందులో పవన్ కల్యాణ్ చేతిలో పెద్ద గన్ పట్టుకొని కాల్పులు జరుపుతున్నాడు. షూట్ గ్యాప్ లో పవన్ ఇలా తుపాకీతో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ స్టైల్ గా కారు మీద కాలు పెట్టి ఫైరింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్ మొదటి నుంచీ గన్స్ అంటే మక్కువ చూపిస్తారనే సంగతి తెలిసిందే.

అందుకే దాదాపు ప్రతీ సినిమాలోనూ ఏదొక సందర్భంలో తుపాకీ పట్టుకుని కనిపిస్తుంటారు. ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి, మరోసారి తుపాకీతో బరిలో దిగుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారని సమాచారం. ఇకపోతే ఇటీవలే పవన్ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

“భీమ్లా నాయక్” చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ - రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.




Full View


Tags:    

Similar News