రాక్ లైన్-చంద్రసిద్దార్థ.. ఆటగదరా శివా

Update: 2017-04-16 06:50 GMT
చంద్ర సిద్ధార్థ పేరెత్తగానే ‘ఆ నలుగురు’.. ‘అందరి బంధువయా’ లాంటి మంచి సినిమాలు గుర్తుకొస్తాయి. ఆరంభం నుంచి తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విలక్షణత చూపిస్తూ వచ్చాడు ఈ దర్శకుడు. ఐతే ఆయన చివరి సినిమా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ సినిమా ఏ రకంగానూ ప్రేక్షకుల్ని మెప్పించలేదు. ఈ సినిమా వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. ఈసారి బాగా గ్యాప్ తీసుకున్న చంద్ర సిద్దార్థ... ఓ వెరైటీ టైటిల్‌ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు.. ఆటగదరా శివా. ఈ పేరుతో తనికెళ్ల భరణి శివుడి మీద ఓ పుస్తకం రాసిన సంగతి గుర్తుండే ఉంటుంది. దానికి మంచి పేరొచ్చింది.

‘ఆటగదరా శివా’లో అందరూ కొత్తవాళ్లే నటిస్తున్నారట. ఇదొక ఆధ్యాత్మిక నేపథ్యంతో సాగే సందేశాత్మక చిత్రం అంటున్నారు. ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు చంద్ర సిద్దార్థ. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. కన్నడలో భారీ సినిమాలు చాలానే చేసిన రాక్ లైన్.. తెలుగులో ‘పవర్’ సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేశాడు. రజినీకాంత్ ‘లింగా’ సినిమాకు కూడా ఆయనే నిర్మాత. హిందీలో బ్లాక్ బస్టర్ మూవీ ‘భజరంగి భాయిజాన్’కు కూడా సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఎప్పుడూ భారీ సినిమాలే చేసే రాక్ లైన్ వెంకటేష్.. చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో కొత్త వాళ్లతో సినిమా చేయడానికి ఒప్పుకోవడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News