టాప్ స్టోరి: స్టార్ హీరోల జేబుకు చిల్లు ప‌డిన‌ట్టేనా?

Update: 2021-09-21 05:52 GMT
ఏపీలో సినిమా టిక్కెట్టు ధ‌ర‌ల మెలిక వెన‌క చాలా సంగ‌తులే ఉన్నాయ‌న్న‌ది ఓ సినీప్ర‌ముఖుడి విశ్లేష‌ణ‌. టికెట్ ధ‌ర‌లు త‌గ్గితే ఏం త‌గ్గుతుంది? అంటే హీరోలు.. ద‌ర్శ‌కుల పారితోషికాల‌కు మాత్ర‌మే చిల్లు ప‌డుతుంద‌ని ఒక సినీపెద్ద విశ్లేషించారు. వ‌కీల్ సాబ్ రిలీజ్ ముందు బెనిఫిట్ షోల ర‌ద్దుతో పాటు టిక్కెట్టు రేటు పెంపును కూడా ఏపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. కోర్టుల తీర్పు అనంత‌రం ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మిది. సాధార‌ణ టికెట్ రేటుతోనే వ‌కీల్ సాబ్ సినిమాని  థియేట‌ర్ల‌లో ఆడించారు.
పెద్ద సినిమాల‌కు రేట్లు పెంచుకునే
వెసులుబాటు ఉన్నా ఇది పూర్తి విరుద్ధ నిర్ణ‌య‌మ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే ఏపీ ప్ర‌భుత్వం టికెట్ రేటు పెంపుపై తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేనా? అస‌లు టిక్కెట్ రేట్లు పెంచ‌డం వ‌ల్ల ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అన్న‌ది ఆరా తీస్తే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఒక సెక్ష‌న్ నుంచి స్పంద‌న వేరొక‌లా ఉంది. నిజానికి టిక్కెట్టు రేటు పెరిగితే దాని వ‌ల్ల భారీ బడ్జెట్ల‌తో సినిమాలు నిర్మించే నిర్మాత‌కు ఎలాంటి లాభం ఉండ‌దు. అలాగే పంపిణీ వ‌ర్గాల‌కు క‌లిసొచ్చేదేమీ ఉండ‌దు. దానివ‌ల్ల లాభంలో వాటాల్ని హీరోలు అడుగుతారు. అదంతా త‌మ‌ను చూసే వ‌చ్చిన లాభం అంటారు. త‌ద్వారా హీరోల పారితోషికాలు పెద్ద‌గా పెరుగుతాయి మిన‌హా ఎవ‌రికీ ఏదీ క‌లిసి రాద‌ని ప్ర‌ముఖ నిర్మాత.. ఏపీ ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాలు విశ్లేషించాయి. పెద్ద హీరోలు.. దర్శకులు టికెట్స్ రేట్స్ పెంచి అమ్ముకోవచ్చు అన్న ఆలోచనతో కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల సినిమా బడ్జెట్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ రేట్స్ కు కొని ఎగ్జిబిటర్స్ ఎక్కువ అడ్వాన్స్ లు ఇచ్చి రిస్క్ లో పడిపోతున్నారు. మనమంతా సామాన్యుల జేబులు కొట్టి హీరోల జేబులు నింపాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఆరోగ్యకర వాతావరణం కావాలంటే ఏపీ సీఎం జగన్మోహ‌న్ రెడ్డి నిర్ణయం సరైనది అని ఏపీ ఛాంబ‌ర్ కి చెందిన కీల‌క వ్య‌క్తి తెలిపారు. హీరోసామ్యం రాజ్య‌మేలే చోట ఇత‌రుల‌కు లాభాలు అనేవి ఉండ‌వు. ఈరోజుల్లో నిర్మాత‌కు లాభాలొచ్చాయి అనేది వ‌ట్టి అబ‌ద్ధం అని కూడా ఆయ‌న‌ అన్నారు.

ఇంత‌కుముందు తెలుగు ఫిలిమ్‌ ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ సెక్టార్ చైర్మన్‌  మాట్లాడుతూ.. టికెట్ ధ‌ర‌ల పెంపుపై ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని తెలంగాణ ప్ర‌భుత్వం అలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌ని అన్నారు. ఇలాంటి నిర్ణ‌యంతో ప్రేక్ష‌కుల‌కు నిర్మాత‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.  టిక్కెట్ల ధర పెంచితే ప్రధానంగా హీరోలకే లాభం.  రేటు పెరిగేకొద్దీ హీరోల రెమ్యునరేషన్‌ కూడా పెరుగుతుంది. కొందరు లాభాల్లో వాటాలు అడుగుతారు. ఇక అద‌న‌పు ధ‌రతో టికెట్ కొనేది మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. పేద ప్ర‌జ‌లే. వాళ్లే సినిమాల‌కు వెళ‌తారు. ఇక పెద్ద సినిమాల‌కు టిక్కెట్ ధ‌ర పెంచాల్సిన ప‌ని లేకుండానే జ‌నం ఆద‌రిస్తారు. అదే చిన్న సినిమాల‌కు ఆద‌ర‌ణ ఉండ‌దు. హీరోల పారితోషికాలు పెరిగితే నిర్మాత‌ల‌కు న‌ష్టం. చిన్న నిర్మాత‌ల‌కు మ‌నుగ‌డ ఉండ‌దు అని విశ్లేషించారు. పెద్ద సినిమాల‌కు టికెట్ ధ‌ర 100 ఉన్నా జ‌నం చూస్తార‌ని అన్నారు. రూ.150 నుంచి రూ.200 ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని విశ్లేషించారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్నారు.. దానికి టిక్కెట్టు ధ‌ర‌ల స‌వ‌ర‌ణ‌తో చెక్ పెట్టిన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు.

మంత్రితో చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మేనా?

టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చా స‌మావేశానికి ఏపీ మంత్రి పేర్ని అధ్య‌క్ష‌త‌న సినీ ప్ర‌ముఖులు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ నుంచి ఆది శేష‌గిరి రావు.. నిర్మాత‌లు దిల్ రాజు..వంశీ..ఎన్వీ ప్ర‌సాద్.. సి. క‌ళ్యాణ్..డి.వివి. దాన‌య్య‌..మైత్రీ మూవీ మేక‌ర్స్ నుంచి ర‌వి..న‌వీన్..పంపిణీవ‌ర్గం నుంచి ఎల్వీఆర్ స‌త్యానారాయ‌ణ‌.. వీర్రాజు..అలంకార్ ప్ర‌సాద్.. ఒంగోలు బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ప‌రిశ్ర‌మ నుంచి ఆది శేష‌గిరిరావు లీడ్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహాన్ రెడ్డితో ఆయ‌న‌కున్న సాన్నిహిత్యం కార‌ణంగా ప‌రిశ్ర‌మ నుంచి ఆయ‌నే మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌న్నింటిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా టిక్కెట్ ధ‌ర‌ల పెంపు.. థియేట‌ర్ యాజ‌మాన్యాలు  ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్ర‌ధానం చ‌ర్చ‌కొచ్చికొచ్చాయి. ఈ సంద‌ర్భంలో ఓ ఎగ్జిబిట‌ర్ ఏకంగా క‌న్నీటి ప‌ర్యంతం చెందారు. ప్ర‌స్తుతం వున్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌ను మెయింటెన్ చేయ‌డం క‌ష్టం అవుతుంద‌ని...ప్ర‌స్తుత ఉన్న టిక్కెట్ ధ‌ర‌తో సినిమా రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని క‌న్నీళ్లు  పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో టిక్కెట్ రేట్ల‌ను 50 నుంచి 250 రూపాయ‌ల మ‌ధ్య‌లో  ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఆ త‌ర్వాత సినిమా స్థాయిని బ‌ట్టి ధ‌ర‌లు నిర్ధేశించుకుంటామ‌ని ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధులు కోరిన‌ట్లు స‌మాచారం. అలాగే ఆన్ లైన్ టిక్కెట్ వ్య‌వ‌స్థ‌కు నిర్మాత‌లు ఒకే చెప్పారు.

నూరు శాతం ఆక్యుపెన్సీ..సెకెండ్ షోకి అనుమ‌తి కోరిన‌ట్లు తెలుస్తోంది.  త‌మ స‌మ‌స్య‌ల‌న్నింటికి మంత్రి దృష్టికి తీసుకెళ్లి త‌గ‌ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేసారు. వీటిపై మంత్రి కొంత‌ సానుకూలంగా స్పందించారు. అన్ని స‌మ‌స్య‌ల్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామ‌ని..త‌మ‌కి త‌గిన విధంగా న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని మంత్రి హామీ ఇచ్చారు. డిస్ట్రిబ్యూట‌ర్లు.. ఎగ్జిబిట‌ర్ల స‌మ‌స్య‌లే ప్ర‌ధానంగా ఇక్క‌డ హైలైట్  అయ్యాయి. కోవిడ్ ముందు నుంచి థియేట‌ర్ వ్య‌వ‌స్థ అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌స్య‌ల‌న్నింటికీ ఓ ప‌రిష్కారం చూపించే అవ‌కాశం ఉంది.. కానీ కొన్ని కండీష‌న్లు మాత్రం అప్ల‌య్ అని చెబుతున్నార‌ట‌. మంత్రి హామీ నేప‌థ్యంలో సీఎం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఏర్పాటు చేసి టిక్కెట్ ధ‌ర‌లు పెంచేందుకు ఆస్కారం ఉండ‌గా.. బెనిఫిట్ షోల‌ను మాత్రం ప‌ర్మినెంట్ గా ర‌ద్దు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News