సినిమాలు ఆపితే ఆర్ధికమూలాలు దెబ్బతింటాయా ?

Update: 2021-12-13 07:30 GMT
ఇపుడిదే విషయం ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎందుకంటే రాష్ట్రంలో తన సినిమాలను నిలిపేసి తన ఆర్ధికమూలాలను దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నిస్తోందంటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచిత్రమైన ఆరోపణలు చేశారు.

తన ఆర్ధికమూలాలు దెబ్బతీయాలని చూసినా తాను భయపడనని గట్టిగానే హెచ్చరించారు. పైగా నిజంగానే ప్రభుత్వం అంత పంతానికి వస్తే తాను కూడా తన సినిమాలను ఉచితంగా వేసి చూపిస్తానని వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలోని జనసేన ఆఫీసులో పవన్ ఒక్కరోజు దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా చేసిన అనేక ఆరోపణలు, వార్నింగుల్లో సినిమాలు ఉచితంగా వేయటం కూడా ఒకటి.

ప్రభుత్వానికి పవన్ ఇచ్చిన తాజా వార్నింగ్ విషయమే జనాల్లో ఎవరికీ అర్ధం కావటంలేదు. పవన్ నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అసలు ఎవరు అడ్డుకుంటున్నారు ? ఏ సినిమాను ప్రభుత్వం అడ్డుకుందో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఆమధ్య నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజయ్యింది కదా. అప్పటినుండి ఇప్పటివరకు మళ్ళీ పవన్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు.

ఒకవేళ పవన్ నటించిన సినిమాలను ప్రభుత్వం అడ్డుకుంటోందనే అనుకుందాం కాసేపు. సినిమా రిలీజ్ ను అడ్డుకుంటే నష్టపోయేది కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టిన సినిమా తీసిన నిర్మాతే కానీ డబ్బులు తీసుకుని నటించిన పవన్ కాదుకదా.

కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుని నటిస్తున్న పవన్ ఏ విధంగా నష్టపోతాడో ఎవరికీ అర్ధం కావటంలేదు. పంతానికి పోతే సినిమాను ఉచితంగా రిలీజ్ చేస్తానని పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. సినిమాను ఉచితంగా వేస్తే నష్టం నిర్మాతకే కానీ నటించిన పవన్ కు ఏముంటుంది ?

సినిమాలు ఆపేసి తన ఆర్ధికమూలాలు దెబ్బ తీస్తున్నారనే ఆరోపణలకు అర్ధమే కనబడటంలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏదో పద్దతిలో బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు.

సినిమా టికెట్లు అమ్మకాలకు ఆన్ లైన్ వ్యవస్ధ ఏర్పాటు అన్నది ఒక్క పవన్ సినిమాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదే ? ఆన్ లైన్ వ్యవస్ధ వల్ల ఏదన్నా నష్టం ఉందనుకుంటే ఆ విషయాన్ని చెప్పటాన్ని ఎవరు తప్పుపట్టడం లేదే.

వ్యాపారాలు దెబ్బతిన్నపుడు వ్యాపారస్తుల, వ్యవసాయం దెబ్బతిన్నపుడు రైతుల ఆర్ధిక పరిస్ధితి దెబ్బతింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే సినిమాలు ఆడకపోతే నిర్మాతలు దెబ్బతింటారే కానీ అందులో నటించిన వాళ్ళకు ఎలాంటి నష్టమూ ఉండదు.

ఎందుకంటే వాళ్ళేమీ డబ్బులు పెట్టుబడిగా పెట్టేదేమీ లేదుకాబట్టి. ఇక్కడ పవన్ పరిస్ధితి కూడా ఇంతే. సినిమాల్లో నటిస్తున్నందుకు పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటారంతే. సినిమా లాభనష్టాల బాధ్యత నిర్మాతలదే. కాబట్టి పవన్ నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా నిలిచిపోయిన పవన్ ఆర్ధికమూలాలేవీ దెబ్బతినవని అందరికీ తెలుసు.
Tags:    

Similar News