'గాడ్ ఫాదర్'కి చెల్లెలితో కష్టమే వచ్చిందే!

Update: 2021-11-17 04:58 GMT
ఒక సినిమాకి ఏ పాత్ర అయితే కీలకమో .. ఆ పాత్రకి తగిన ఆర్టిస్ట్ దొరక్కపోతే అప్పుడు ఉండే టెన్షనే వేరు. అలాంటి టెన్షన్ ను ఇప్పుడు 'గాడ్ ఫాదర్' టీమ్ ఫేస్ చేస్తోంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన చెల్లెలి పాత్రను పోషించేవారి కోసం ఒక రేంజ్ లో గాలింపు జరుగుతోంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, ఆ మధ్య మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన 'లూసిఫర్' సినిమాకి రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించగా, ఆయన చెల్లెలి పాత్రను మంజు వారియర్ పోషించారు.

ఆ సినిమా చూస్తే అందులో హీరో పాత్రకి చెల్లెలి పాత్ర ఎంత అవసరమనేది అర్థమవుతుంది. ఆ పాత్ర ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుందనేది స్పష్టమవుతుంది. ఆ సినిమాలో కథానాయకుడైన అన్నయ్యను చెల్లెలు అపార్థం చేసుకుంటుంది. ఆ తరువాత పోను పోను ఆయన ఎంత గొప్పవాడనే విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అప్పటివరకూ ఆయన పట్ల పెంచుకున్న ద్వేషాన్ని పక్కన పెట్టేసి, తాను ఉన్న పరిస్థితి నుంచి తనని గట్టెక్కించమని కోరుతుంది. దాంతో చెల్లెలిని కాపాడటం కోసం ఆయన రంగంలోకి దిగుతాడు. ఆమె కోసం ఆయన ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు.

దీనిని బట్టి ఈ సినిమాలో హీరో తరువాత స్థానంలో హీరోయిన్ కాకుండా చెల్లెలి పాత్ర కనిపిస్తోంది. ఈ పాత్రకి అంత ప్రాధాన్యత ఉండటం వల్లనే బాగా క్రేజ్ ఉన్న సీనియర్  హీరోయిన్స్ కోసం చూస్తున్నారు. ఆ క్రమంలో విద్యాబాలన్ .. నయనతార .. సుహాసిని .. శోభన పేర్లు వినిపించాయి. ప్రస్తుతానికి ఈ ప్రచారం రమ్యకృష్ణ దగ్గరికి వచ్చి ఆగింది. అయితే ఇంతకుముందు పేర్ల మాదిరిగానే ఈ పేరును తెరపైకి తీసుకొచ్చారా? లేదంటే నిజంగానే ఆమెను సంప్రదిస్తున్నారా? అనేది చెప్పలేం. ఎందుకంటే 'నాన్న .. పులి ..' కథ గుర్తొస్తుంది గనుక.

'లూసిఫర్' సినిమాలో హీరోయిన్ ఉండదు. కానీ ఇక్కడి ప్రేక్షకుల్లో ఒక వర్గం వారు హీరోయిన్ లేకపోతే ఒప్పుకోరు. "హీరో ఇంత కష్టపడుతున్నది ఎవరి కోసం? ఏం ఆ మాత్రం ఒక రెండు పాటలు ఆమెతో వేసుకునే అవకాశం ఆయనకి ఇవ్వరా?" అంటూ గోల చేస్తారు. అందుకనే ఆ పాత్ర కోసం అనుష్కను అడుగుతున్నట్టు వినికిడి. ఇక మూలంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఒక చిన్న పాత్రను, తెలుగులో సల్మాన్ తో చేయిస్తున్నారు. చిరూ - సల్మాన్ తో కలిసి డాన్స్ చేయించనున్నారు. అందుకోసం ఒక సాంగ్ ను ఫేమస్ పాప్ సింగర్ తో పాడిస్తున్నారు. 'గాడ్ ఫాదర్' ఇలాకాలో ఇంత జరుగుతూ ఉన్నా, చెల్లెలు లేని లోటు లోటుగానే ఉంది. చెల్లెలి పాత్రకి ఇంత హడావిడా? అనుకోవద్దు. అన్నయ్యకి తగిన చెల్లెలు దొరకాలంటే కాస్తంత కష్టమే మరి!    
Tags:    

Similar News